బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ ఓ ఇంటి వారయ్యారు. వీరిద్దరి మధ్యా గత కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడిచిన సంగతి విదితమే. గత ఏడాది సెప్టెంబరులో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 22వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నట్టు పెళ్లి కార్డును కూడా గుత్తా జ్వాల సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో అట్టహాసంగా పెళ్లి చేసుకునే అవకాశం లేదు. అందుకే దగ్గరి బంధువుల సమక్షంలో నిరాడంబరంగానే వీరు పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది.
వీరిద్దరికీ ఇది రెండో వివాహం. ఇద్దరూ మొదటి జీవిత భాగస్వామికి విడాకులు ఇచ్చి రెండో పెళ్లికి సిద్దమయ్యారు. రజనీ నటరాజన్‌ను 2010లో పెళ్లి చేసుకున్నారు విష్ణు విశాల్. ఆ తర్వాత 2018లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. ఇక గుత్తా జ్వాల విషయానికి వస్తే బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను ఆమె 2005లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2011లో విడాకులు తీసుకున్నారు.
మొదటిది కూడా ప్రేమ వివాహమే. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇద్దరూ దండలు మార్చుకుని కనిపించారు. వివాహం ఎన్ని గంటలకు అనేది చెప్పకపోవడంతో వివాహం జరిగినట్టుగానే అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటున్న దృష్ట్యా బంధువుల రాకకు ఇబ్బంది కరమనే ఉద్ధేశంతో పగలే పెళ్లి జరిగినట్టు సమాచారం.











