1947 ప్రాంతంలో దేశ స్వాతంత్ర్యం కోసం భారత ప్రజలంతా తెల్లవారితో పోరాడుతుంటే, హైదరాబాద్ సంస్థానంలోని 16 జిల్లాల ప్రజలు మాత్రం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రజాకార్లతో యుద్ధం చేస్తున్నారు. అలా చేయగా చేయగా సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ సంస్థానం భారత్ లో కలిసింది. పోలీస్ చర్య, హైదరాబాద్ విలీనం వెనుక ఘనమైన చరిత్ర ఉంది.
నిజాం రాజులు హైదరాబాద్ సంస్థానాన్ని సుమారు 200 ఏళ్లు పాలించారు. మనలో చాలా మంది ప్రస్తుతం రజాకార్ల గురించి వినడమే తప్ప చూడలేదు. కానీ మన ముసలివాళ్లకు అది గుర్తు చేస్తే మాత్రం అప్పటి రోజుల గురుంచి కథలు కథలుగా చెబుతారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రజలంతా నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేసి భూస్వామ్యానికి సమాధి కడుతున్న రోజుల్లో నిజాం రాజు రంగంలోకి దింపిన కిరాయి మూకలే రజాకార్లు. వారి అరాచకాలకు హద్దే లేకుండా పోయింది. కనబడిన ఆడవాళ్లకు చెరిచే వారు. పన్నుల రూపంలో ఇళ్లమీద పడి దోచుకునే వారు.
1927లో పురుడు పోసుకున్న ఎంఐఎం పార్టీ
1927లో నాటి నిజాం రాజు బహదూర్ యార్ జంగ్ ‘ఎంఐఎం’ పార్టీ(‘మజ్లిస్-ఇ-ఇత్తెహదుల్ ముస్లిమీన్ పార్టీ’)ని స్థాపించారు. హైదరాబాద్ సంస్థానంలో ముస్లిం మత విస్తరణ, దాని సాంస్కృతిక వైభవాన్ని కాపాడే ఉద్దేశంతో దీన్ని ఆనాడు స్థాపించారు. బహదూర్ యార్ జంగ్ అనుమానాస్పద రీతిలో 1944లో మరణించారు. ఆ తర్వాత ఎంఐఎం పార్టీ నాయకత్వం ఖాసిం రజ్వీ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో భారత్ సైన్యానికి నిజాం లొంగిపోయిన తర్వాత ఖాసిం రజ్వీని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం జైలు నుంచి విడుదలైన ఖాసీం పాకిస్తాన్ కు వెళ్లిపోయే ముందే ఎంఐఎం పార్టీని సమర్థుడైన వ్యక్తి చేతిలో పెట్టాలని భావించాడు.
ఎంఐఎం పగ్గాలు రజ్వీ నుంచి ఓవైసీ చేతిలోకి…
పార్టీని ఒక వ్యక్తి చేతిలో పెట్టేందుకు రజ్వీ అప్పటికప్పుడు సమావేశం ఏర్పాటు చేసేందుకు పార్టీ సభ్యులకు సమాచారం పంపించారు. అందులో పార్టీ ముఖ్యమైన నాయకులు హాజరయ్యారు. ఆ సమావేశంలో రజ్వీ..పన్నెండేళ్లకు పైబడిన వారు ఎవరైనా పార్టీ పగ్గాలు అందుకోవచ్చని, అందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పార్టీ నాయకుల నుంచి ఆ బాధ్యతల్ని తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ సందర్భంలో అబ్దుల్ వహీద్ ఓవైసీ అనే 18 ఏళ్ల ఓ యువకుడు ముందుకొచ్చినట్లు చరిత్రకారులు చెబుతారు. వహిద్ ఒవైసీకి అప్పటికి ఎంఐఎంతో ఎలాంటి సంబంధం లేదు. వహిద్ ధైర్యాన్ని చూసిన ఖాసిం రజ్వీ.. ఎంఐఎం పార్టీ అధినేతగా వెంటనే ఆయన పేరును ప్రపోజ్ చేశారట. ఆవిధంగా పార్టీ పగ్గాలు ఒవైసీ చేతుల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ మరుక్షణమే మజ్లిస్ పార్టీ (ఎంఐఎం) పేరును ‘ఏఐఎంఐఎం’ (ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్లెహాద్-ఉల్ ముస్లిమీన్)గా మారినట్లు పేర్కొంటారు.
ఏఐఎంఐఎం ను రాజకీయ రక్షగా భావించిన ముస్లీంలు…
హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేసిన తర్వాత ఎంఐఎం పార్టీని నిషేధించారు. అలాంటి పార్టీకి నాయకత్వం వహించడం, ముస్లింలను రెచ్చగొట్టేవిధంగా ప్రసంగించారనే అభియోగాలతో వహిద్ ఒవైసీని అరెస్టు చేశారు. 11 నెలల జైలు శిక్ష తర్వాత ఆయన విడుదలయ్యారు. జైలు నుంచి తిరిగొచ్చిన తర్వాత ఎంఐఎంకి నూతన ఉత్తేజాన్ని అందించేందుకు వహిద్ ఒవైసీ పూర్తి సమయాన్ని వెచ్చించారు. విలీనం తరువాత అభద్రతాభావానికి గురైన ముస్లింలు ఏఐఎంఐఎం పార్టీనే తమకు రాజకీయ రక్షగా భావించారు. దీంతో క్రమంగా ఆ పార్టీ బలపడింది. ఈ నేపథ్యంలోనే జైలు జీవితం ముగిశాక.. వహిద్ ఒవైసీకి కేంద్ర మంత్రి పదవిని ఇచ్చేందుకు కూడా నెహ్రూ ఆసక్తి చూపారట. కానీ, వహిద్ అందుకు అంగీకరించలేదని చరిత్ర చెబుతోంది.
1975లో వహిద్ ఒవైసీ మరణం తరువాత కుమారుడు సలావుద్దీన్ ఒవైసీ(అసదుద్దీన్ తండ్రి) పార్టీ పగ్గాలను వారసత్వంగా తీసుకున్నారు. ఆయన తర్వాత ఆయన కుమారులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీ ప్రస్తుతం ఏఐఎంఐఎం పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. అలా ఎంఐఎం పార్టీ రజ్వీ నుంచి ఓవైసీ చేతుల్లోకి మారింది.










