ఉద్యమకారుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఉద్యమ సమయంలో కలిసి పనిచేసిన వారు ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. ఎమ్మెల్సీ తెచ్చిన చిచ్చుతో ఇద్దరు నేతల మధ్య గ్యాప్ బాగానే వచ్చింది. వారే టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్. గ్రాడ్యుయేట్ ఎన్నికలు నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య గ్యాప్ పెరిగింది.
గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తను పోటీ చేస్తానని తనకు మద్దతు ఇవ్వమని చెరకు సుధాకర్ ను కోరారు కోదండరాం. ఇంటి పార్టీ కార్యాలయానికి వెళ్ళి మరీ లేఖ ఇచ్చారు. అయితే తానే ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్నట్టు చెరకు సుధాకర్ తెలిపారు. గత నలభై ఏళ్ళ నుండి తాను తెలంగాణ రాష్ట్రంతో పాటు హక్కుల సాధనకై పోరాటం చేస్తున్నానని .. తనకు ఒక సారి అవకాశం ఇచ్చి గెలిపించమని చెరకు సుధాకర్ కోదండరాంను కోరారు.
డాక్టర్ గా తాను ప్రజలకు సేవసేయడంతో పాటు తొలి మలి దశ తెలంగాణ పోరులో కీలకంగా పనిచేసానని చెప్పుకొస్తున్నారు. ఇక వెనక బడిన వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిథ్యం విషయంలో ఇప్పటికీ అన్యాయం జరుగుతోందని.. రెడ్డి కులానికి చెందిన కోదండ రాంకు తను మద్దతు ఇస్తే ప్రజల నుండి తనకు వ్యతిరేకత వస్తుందని చరకు సుధాకర్ చెబుతున్నారు.
కోదండ రామ్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో మినహా ఎక్కడా ప్రజల మధ్య లేడని విమర్శిస్తున్నారు చెరకు సుధాకర్. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేసిన పేరు తప్పితే నల్లగొండ, వరంగల్ , ఖమ్మం జిల్లాల్లో ఎక్కడా ఆయన పెద్దగా తిరిగింది లేదంటున్నారు చెరకు.
ప్రొఫెసర్ గా హైదరాబాద్ లోనే ఆయన జీవితం ఎక్కవ కాలం గడిచిందని అక్కడే ఆయన స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని చుట్టపు చూపుగా మాత్రమే వరంగల్ వైపు చూస్తాడని ఆయన చెబుతున్నారు. జయశంకర్ కు వారసుడిగా చెప్పుకుంటున్న కోదండరాం ఆయన అడుగు జాడల్లో ఏనాడూ నడవలేదంటున్నారు. కోదండరామ్ చట్ట సభల్లో అడుగు పెట్టాలను కుంటే హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నియోజకవర్గ పట్టభద్రుల స్థానానికి పోటీ చేయవచ్చని సూచిస్తున్నారు చెరకు సుధాకర్.
కోదండరాం హైదరాబాద్ లో పోటీచేయాలట
హైదరాబాద్ తోనే కోదండరాంకు ఎక్కవగా అనుబంధం ఉందని విద్యాభాస్యం మొదలుకొని యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేయడం ఇప్పుడు కూడా హైదరాబాద్ లోనే తన నివాసం ఉంటున్నందున అక్కడే ఆయన పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఉంటాయంటున్నారు. అవసరం అయితే తను కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తా అంటున్నారు.
మొత్తానికి తెలంగాణలో త్వరలో జరగబోతున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల సందర్భంగా ఇద్దరు తెలంగాణ ఉద్యమ కారుల మధ్య పోరులో ఏ ఒక్కరినైనా ఓటర్లు కనికరిస్తారా… ఇద్దరినీ కాదని అధికార తెరాసకు పట్టం కడతారా చూడాలి.











