ఇది నిజంగా పోలీసులకు పెద్ద సవాలే. ఎందుకంటే కేవలం నాలుగు రోజుల్లోనే వందల మిస్సింగ్ కేసులు తెలంగాణ వ్యాప్తంగా నమోదయ్యాయి.
క్రైమ్ రేటు రాష్ట్రంలో గతంలో కంటే కాస్త తగ్గుముఖం పుడుతుందన్న తరుణంలో కొన్ని రోజులుగా నమోదవుతున్న మిస్సింగ్ కేసులు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. కేవలం నాలుగు రోజుల్లోనే తెలంగాణ వ్యాప్తంగా 203 మంది అదృశ్యమైనట్లు కేసులు నమోదయ్యాయి. గత బుధవారం ఒక్క రోజే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 11 మంది, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 13 మంది, రాచకొండ పరిధిలో మరో 8 మంది మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 65 కేసులు నమోదయ్యాయి.
పోలీసులకు సవాల్…
అసలు ఉన్నట్లుండి వందల మంది ఎలా అదృశ్యమవుతున్నారో పోలీసులకు అంతుచిక్కడంలేదు. రాష్ట్రంలో నమోదవుతున్న మిస్సింగ్ కేసులు పోలీసులకు తలనొప్పిగా మారుతున్నాయి. రోజుల వ్యవధిలోనే ఇలా 203 కేసులు నమోదవడం ఇది పోలీసులకు నిజంగా సవాలే. ఈనెల 26వ తేదీన 65 మిస్సింగ్ కేసులు, 27న 62 కేసులు, 28న 65 కేసులు, 29న 11 మంది అదృశ్యమైన కేసులు నమోదైనట్లు పోలీసు వెబ్‌సైట్‌లో వెల్లడించారు. అసలు ఎందుకు ఇంతలా మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయనే విషయంపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. వివిధ కారణాలతో ఇళ్ల నుంచి తమ వారికి చెప్పకుండా వెళ్లిపోతున్నట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ మిస్సింగ్ కేసులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
లాస్ట్ ఇయర్ 3418 పెండింగ్ కేసులు…
ఈ ఏడాదిలో అక్టోబర్ 26వ తేదీ వరకు రాష్ట్రంలో మొత్తం 1282 మిస్సింగ్ కేసులు నమోదైనట్లు సమాచారం. గతేడాది తెలంగాణలో నమోదైన మిస్సింగ్ కేసుల్లో ఇంకా 3418 మిస్సింగ్ కేసులు పరిష్కారం కాలేదని సమాచారం. ప్రతి ఏటా నమోదవుతున్న మిస్సింగ్ కేసుల్లో 85 శాతం మాత్రమే పురోగతి సాధిస్తున్నాయని తెలుస్తోంది. ఇలా మిస్సింగ్ కేసుల్లో మహిళలు, మైనర్లు, పురుషులు అన్ని వర్గాలవారు ఉంటున్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను సీఐడికి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కిడ్నాపింగ్ ముఠాలు ఏమన్నా రాష్ట్రంలో దిగినయా అనే అనుమానాలు కూడా సర్వత్ర వ్యక్తమవుతున్నాయి. లేక చిన్న చిన్న కారణాలు, ప్రేమ వ్యవహారం, వివాహేతర సంబందాలు, కుటుంబ తగాదాలు, భార్య భర్తల మధ్య తలెత్తే చిన్న చిన్న గొడవలు వల్ల చెప్పకుండానే ఇళ్లనుంచి వెళ్లిపోతున్నవారి సంఖ్య కూడా చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇలాంటి కారణాలతో వెళ్లిపోయి కొన్ని రోజుల తరువాత మళ్లీ ఇంటికి తిరిగొచ్చిన కేసులు కూడా ఉన్నాయి. అలాగే ఇటీవలే శామీర్‌పేట్, మహబూబాబాద్ మైనర్ల మర్డర్, కిడ్నాప్ కేసులు రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే.
దర్పణ్ యాప్‌తో పరిష్కారం..
మిస్సింగ్ కేసులను చేధించడంలో పోలీసులు ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. పోలీస్ వెబ్‌సైట్‌లో అప్‌లోడైన డేటాబేస్ ఆధారంగా పరిష్కరించడంతోపాటు సీసీటీఎన్ఎస్ ద్వారా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పెట్రోల్ వెహికిల్స్, బ్లూకోల్ట్స్, పోలీస్ యాప్స్, బీట్ కానిస్టేబుల్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీంలతో మిస్సింగ్ కేసులను పరిష్కరిస్తున్నారు. దీంతోపాటు ఫేస్ రికగ్నేషన్ సిస్టంను కూడా ఉపయోగిస్తున్నారు. దర్పణ్ యాప్ ద్వారా పోలీసులు చాలా వరకు మిస్సింగ్ కేసులను చేధిస్తున్నారు. కేసలను చేధించటంలో ఇలాంటి ఆధునిక పద్ధతులను పోలీసులు ఉపయోగిస్తున్నా వందల కేసులు కొత్తగా నమోదు కావడం వారికి తలనొప్పిగా మారుతోంది.











