దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న వేళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు కరోనా విషయంలో ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రతి ఒక్కరికీ కరోనా వ్యక్సిన్ అందిస్తామని తెలిపారు.
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత ఇంకా తగ్గనేలేదు. అయినా కానీ జాగ్రత్తలు పాటిస్తూ కరోనా ఆందోళన మధ్యనే ప్రజలు కాలంతో పరుగులు పెడుతున్నారు. వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందానని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో వ్యాక్సిన్ విషయంలో దేశ ప్రజలకు ప్రధాని మోడీ స్పష్టత ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే దేశ ప్రజలందరికీ అందిస్తామని ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్య్వూలో ప్రకటించారు. ఏ ఒక్క వ్యక్తినీ వదలకుండా ప్రతి పౌరుడికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మోడీ తెలిపారు.
వ్యాక్సిన్ పంపిణీ వ్యవస్థ..
ముందుగా కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో ముందుండి విధులు నిర్వర్తిస్తున్న కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి వ్యాక్సిన్ అందిస్తామని మోడీ పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీలో పురోగతి సాధిస్తున్నామని, ట్రయల్స్ కొనసాగుతున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు వ్యాక్సిన్ పంపిణీ వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ను నిల్వ చేయడానికి 28 వేల కోల్డ్ చైన్ పాయింట్లను కూడా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
దేశంలోని నలువైపులా ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా వ్యాక్సిన్ అందేలా చూస్తామన్నారు. దీనికోసం వ్యాక్సిన్ పంపిణీ నిపుణుల బృందాన్ని కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వ్యాక్సిన్ పంపిణీ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేయాలని అధికారులకు ప్రధాని సూచించారు. కరోనా వ్యాక్సిన్‌పై మోడీ చేసిన తాజా ప్రకటన దేశ ప్రజల మదిలో ఆశలను చిగురించిందని చెప్పాలి. త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఖాయమని ప్రధాని మాటలతో స్పష్టమైంది.