రాజకీయాలుమాని .. జిల్లా కేంద్రం చెయ్యండి!
ఆంధ్రప్రదేశ్ జిల్లా పునర్విభజన అంశం తెరపైకి తెచ్చి ప్రాంతాల మధ్య చిచ్చును రాజేస్తున్నారు. ప్రాంతీయ విధ్వేసాలను రగిల్చి అందులో చలికాచుకోవాలని చూస్తున్నారు జగన్ రెడ్డి! ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రం చేస్తానన్న సీఎం జగన్ రెడ్డి.. మరి హిందూపురాన్ని ఎందుకు రాజకీయంగా చిన్నచూపు చూస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హిందూపురం పార్లమెంట్ కేంద్రాన్ని సత్యసాయి జిల్లాగా ప్రకటిస్తూ.. జిల్లా కేంద్రాన్ని పుట్టపర్తిలో ఏర్పాటు చేయడం పట్ల ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేతృత్వంలో గత రెండురోజులుగా నిరసన కార్యక్రమాలు ఇక్కడ మిన్నంటుతున్నాయి. నిన్న భారీ ర్యాలీ, మౌన దీక్షలతో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని ఎమ్మెల్యే బాలయ్య ఖండించారు. హిందూపురంలోనే సత్యసాయి జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి, జిల్లా కేంద్రాన్ని పుట్టపర్తిలో ఏర్పాటు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం అలా ప్రకటించేంత వరకు ఉద్యమాన్ని విరమించేది లేదు, అవసరమైతే ఎమ్మెల్యే పదివీకి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు బాలయ్య! నిన్న నిరసన కార్యక్రమాలు, అఖిలపక్ష నేతలతో భేటీ ముగిసిన తరువాత, శనివారం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు.
ఎన్టీఆర్ క్యాంటీన్లు ఎందుకు మూసివేశారు..?
ఎన్టీఆర్ పై అభిమానం ఉందని చెప్పకొస్తున్న వైసీపీ ప్రభుత్వం.. అన్నా క్యాంటీన్లు ఎందుకు మూసేశారని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరుతో జిల్లా కేంద్రం ప్రకటించి అభిమానం ఉన్నట్లు చెబుతున్న జగన్.. ఆయన పేరుపై టీడీపీ ప్రభుత్వ హయంలో అన్నార్తుల ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్లను ఎందుకు మూసేసినట్లు అని ఆయన నిలదీశారు. రాత్రికి రాత్రి జిల్లాలు ప్రకటించి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, అదికార పార్టీ కుట్రలను అందరూ గమనిస్తునే ఉన్నారని పేర్కొన్నారు. హిందూపురంలో జిల్లా కేంద్రం సాధించేందుకు అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని బాలయ్య ప్రకిటంచారు. హిందూపురంలో అన్ని వసతులు ఉన్నాయని, అవసరమైతే పుట్టపర్తిలోనూ ఆందోళన చేస్తామని హెచ్చరించారు.