బీజేపీ బలహీనంగా ఉండే రాష్ట్రాల్లో తమ బలం పెంచుకునేందుకు బీజేపీ పార్టీ దృష్టిసారించింది. ఇందులో భాగంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మరికొన్ని రాష్ట్రాలలో పార్టీని మరింత అభివృద్ది చేసేందుకు బీజేపీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా ఓ టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నది. దీనికోసం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జీలను బీజేపీ అధ్యక్షుడు జెపీ నడ్డా నియమించారు. పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చేసే నేతల పేర్లను ప్రకటించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గట్..
దుబ్బాకలో బీజేపీ విజయం ఆ పార్టీలో కొత్త ఊపును తీసుకొచ్చింది. తెలంగాణలో కష్టపడితే భవిష్యత్తులో తమదే అధికారం అనే ఆలోచనలో బీజేపీ పార్టీ భావిస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక ఫోకస్‌ను బీజేపీ పెట్టింది. ఇప్పటికే ఈ రాష్ట్రం నుంచి నలుగురు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనికి తోడు నిన్న దుబ్బాక విజయం ఆ పార్టీలో బూస్ట్ తీసుకొచ్చింది. ఇదే ఉత్సాహంతో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. పార్టీని మరింతగా బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. వచ్చే నెలలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో ఈ ఎన్నికలపై బీజేపీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పార్టీ ఇంఛార్జీ బాధ్యతలను తరుణ్‌చుగ్‌కు అప్పగించారు. జమ్మూకాశ్మీర్, లేహ్ ఇంఛార్జీ బాధ్యతలతో పాటు తెలంగాణ బాధ్యతలనూ అప్పగించారు. ఈయన పంజాబ్‌కు చెందిన బీజేపీ నేత. జీహెచ్ఎంసీ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర నాయకత్వం సీరియస్‌గా తీసుకుని బరిలోకి నిలవనుంది. ఈతరుణంలో రాష్ట్రానికి కొత్త ఇంఛార్జీ నియామకం ఆ పార్టీకి మరింత లాభం చేకూరనుంది.
ఏపీకు మురళీధరన్…
తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో బీజేపీ పార్టీ బలహీనంగానే ఉన్నదని చెప్పుకోవాలి. ఏపీలో పార్టీని మరింతగా అభివృద్ది చేసేందుకు గానూ మురళీధరన్‌ను ఇంఛార్జీగా నడ్డా నియమించారు. ఈయన ప్రస్తుతం భారత విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. ఈయన కేరళకు చెందిన నేత. ప్రస్తుతం ఉన్న ఇంఛార్జీ సునీల్ దియోధర్‌కు సహ ఇంఛార్జీ బాధ్యతలను కట్టబెట్టింది.
ఛత్తీస్‌ఘడ్, ఓడిశాకు పురంధేశ్వరి..
తెలుగు రాష్ట్రాల్లోని కీలక నేతలకు ఇతర రాష్ట్రాల పార్టీ బాధ్యతలను అప్పగించింది. బీజేపీ జాతీయ కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరిని ఓడిశా, చత్తిస్‌ఘడ్ రాష్ట్రాల ఇంఛార్జీ బాధ్యతలను కట్టబెట్టారు. అలాగే డీకే అరుణను కర్నాటక సహ ఇంఛార్జీగా బాధ్యతలను అప్పగించారు. మధ్యప్రదేశ్ ఇంఛార్జ్‌గా మురళీధరరావును, ఉత్తరప్రదేశ్ సహ ఇంఛార్జీ, అండమాన్ నికోబార్ ఇంఛార్జీగా సత్యకుమార్‌ను నియమించింది. అంతేకాకుండా తమిళనాడు సహ ఇంఛార్జీగా పొంగులేటి సుధాకర్‌రెడ్డిని బీజేపీ నాయకత్వం నియమించింది.