ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా లేనివారు లేరంటే అతిశయోక్తి కాదు. బ్యాంకు ఖాతా ఉంటే తప్పనిసరిగా డెబిట్ కార్డు ఇస్తారు. ఇక క్రెడిట్ కార్డు అంటారా, పట్టణ ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. అయితే ఇటీవల కాలంలో డెబిట్, క్రెడిట్ కార్డుల దుర్వినియోగం పెరిగిపోతోంది. అనేక మంది ఫిషింగ్ వలలో పడి మోసపోతున్నారు.
ఆన్ లైన్ దొంగలు ముందుగా ఏదో ఒక లింకు మొబైల్ కు పంపిస్తారు. మనకు ఏదో సమాచారం వచ్చిందని తొందరపడి నొక్కామో ఇక అంతే బ్యాంకు ఖాతాలో సొమ్ముమాయం. ఇలాంటి మోసాలు మనం ప్రతిరోజూ వింటూనే ఉన్నాం.
ముఖ్యంగా డెబిట్, క్రెడిట్ కార్డుల మోసాలు అన్నీ ఇన్నీ కావు. కార్డులు ఎక్కడబడితే అక్కడ స్వైప్ చేస్తే, అక్రమార్కులు కార్డు సమాచారం మొత్తం కాజేస్తారు. ఆ సమాచారంతో కొత్త కార్డు తయారుచేసుకుని, బ్యాంకులో డబ్బులు కొల్లగొడుతున్న సంఘటనలు కోకొల్లలు. ఇలాంటి ఆర్ధిక నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది.
విదేశాల నుంచి డబ్బు కాజేయడం ఇక కుదరదు
ఎక్కడో మారుమూల బీరవల్లిపాయగ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్న రైతు తోట నరశింహారావు బ్యాంకు ఖాతా నుంచి డబ్బు మాయం అయింది. బ్యాంకు అధికారులను సంప్రదిస్తే, సింగపూర్ లో నీ డెబిట్ కార్డు నుంచి డబ్బు డ్రా చేశారని చెప్పారు. దీంతో ఆ రైతుకు ఏం చేయాలో అర్ధం కాలేదు. పోలీసు కేసు పెట్టినా పెద్దగా ప్రయోజనం ఉండదు. విదేశాల్లో డబ్బు డ్రా చేయాల్సిన అవసరం ఆ రైతుకు లేదు.
కాని అతని కార్డుకు విదేశాల్లో కూడా డబ్బు డ్రా చేసే సేవలు ఇచ్చారు. ఈ ఒక్క కారణంతో అతని డబ్బు లూటీ అయింది. ఇలాంటి చెత్త నిబంధనలను ఆర్బీఐ ఎట్టకేలకు మార్చింది. ఎవరో వందకు ఒకరో ఇద్దరో విదేశాలు వెళతారు. అలాంటి వారికి మాత్రమే విదేశాల్లో నగదు డ్రా చేసుకునే సదుపాయం కల్పిస్తే సరిపోతుందని ఆర్బీఐ కొత్త నిబంధనల్లో పొందుపరిచారు. అది కూడా వినియోగదారుడు అడిగితేనే విదేశాల్లో డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా నగదు డ్రాచేసుకోవడం, షాపింగ్ చేసుకునే సదుపాయం కల్పిస్తారు. ఆర్బీఐ కొత్త నిబంధనలతో ఇక సామాన్యుల డబ్బు విదేశాల్లో కొల్లగొట్టే ఆర్ధిక నేరాలకు కళ్లెం పడినట్టే.
వినియోగదారుడు కోరుకునే సేవలు మాత్రమే..
డెబిట్, క్రెడిట్ కార్డు చేతిలో పడగానే కార్డులకు సంబంధించిన అన్ని సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో 98 శాతం వినియోగదారులు కేవలం ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసుకోవడానికి, లేదంటే షాపింగ్, పెట్రోల్ కొట్టించుకోవడానికి మాత్రమే వాడతారు. కార్డులను విదేశాల్లో వాడే వారి శాతం 2 శాతం మించి లేదు. అలాంటప్పుడు 98 శాతం మందికి విదేశాల్లో నగదు డ్రా చేసే సదుపాయం, విదేశాల్లో షాపింగ్ చేసే సదుపాయం అవసరం లేదు. అందుకే ఆర్బీఐ మంచి నిర్ణయం తీసుకుంది.
డెబిట్, క్రెడిట్ కార్డులు ద్వారా ఈ రెండు సేవలు అంటే నగదు డ్రా చేసుకోవడం, స్వదేశంలో షాపింగ్ సేవలు మాత్రమే అందిస్తుంది. అదనపు సేవలు కావాలంటే బ్యాంకులను సంప్రదించి, మీకు ఏమేమి సేవలు కావాలో తెలియజేయాలి. అందుకు మీ అంగీకారం తెలపాల్సి ఉంటుంది.
కార్డుల సేవల మార్పులు ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు
డెబిట్, క్రెడిట్ కార్డులు వినియోగించేవారు తమకు కావాల్సిన సేవలను ఎప్పుడైనా మార్పుకోవచ్చు. ఇందుకోసం 24 గంటలూ పనిచేసే సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. అంటే కార్డుదారులు తమకు ఏలాంటి సేవలు కావాలో చెబితే ఆ సేవలు మాత్రమే కార్డు ద్వారా అందుతాయి. తద్వారా కార్డుల దుర్వినియోగం తగ్గుతుంది. ఆర్థిక నేరాలకు కూడా కళ్లెం పడుతుంది.










