మెగాస్టార్ ఆచార్య సినిమా విడుదల తేదీ మీద స్పష్టత రావడంతో మెగా అభిమానుల్లోనూ క్లారిటీ వచ్చేసింది. ఫిబ్రవరి 4న ఈ సినిమా విడుదలవుతుందని అందరూ భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఫిబ్రవరి విడుదల సాధ్యమయ్యేలా లేదు. పెద్ద సినిమాల విడుదలలన్నీ వాయిదా పడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ, క్రేజీ చిత్రం ఆచార్య. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తే.. చరణ్ సరసన పూజా హేగ్డే నటించింది.
శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఉగాది సందర్భంగా.. ఏప్రిల్ 1 విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి స్పందిస్తూ.. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేయాలనుకున్నాం కానీ కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయడం భావ్యం కాదనిపించింది.
అందువల్ల సినిమాను ఫిబ్రవరి 4న కాకుండా ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తున్నాం. ఎన్నో అంచనాలు పెట్టుకున్న సినిమా వాయిదా పడటం అనేది మెగా ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించే అంశమే. అయితే.. ఈ వెయిటింగ్‌కు తగ్గ ఫలితం ఉంటుందని గ్యారంటీగా చెప్పగలం. ఉగాది సందర్భంగా ఆచార్య చిత్రాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఫ్యాన్స్ ఎంత ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నారో.. మేం కూడా అంతే ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాం అని చెప్పారు. ట్విట్టర్ ద్వారా కూడా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. అప్పటికి తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ థర్డ్ వేవ్ పరిస్థితులు కూడా సర్ధుమణుగుతాయని భావిస్తున్నారు.











