టాలీవుడ్లో విభిన్నమైన కథలతో అలరిస్తూ వస్తున్న యువ కథానాయకులలో చందూ మొండేటి ఒకరు. ఆయన నుంచి వచ్చిన తొలి చిత్రమే ‘కార్తికేయ‘. సుబ్రహ్మణ్యస్వామి ఆలయం నేపథ్యంలో ఆయన నడిపించిన కథ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆయన స్క్రీన్ ప్లే .. టేకింగ్ ప్రశంసలను అందుకున్నాయి. తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకోవడంతో ఆయనకి వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఆయన మాత్రం నిదానమే ప్రధానమన్నట్టుగా కొంత సమయం తీసుకుని, మలయాళంలో ఘన విజయాన్ని అందుకున్న ‘ప్రేమమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేశాడు. ఈ సినిమా కూడా ఆయనకి మంచి పేరును తెచ్చిపెట్టింది.
ఇక మూడో సినిమాగా ఆయన ‘సవ్యసాచి‘ సినిమాను తెరకెక్కించాడు. చైతూ కథానాయకుడిగా, ఒక కొత్త కాన్సెప్ట్ తో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కవల సోదరుల కాన్సెప్టే అయినా, ఒక వ్యక్తిలో మరో వ్యక్తి అంతర్లీనంగా ఉండటం అనే కొత్త పాయింట్ ఎక్కువమంది ప్రేక్షకులకు సరిగ్గా అర్థం కాలేదేమో, ఆ సినిమా పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలోనే గతంలో తనకి ఘన విజయాన్ని తెచ్చిపెట్టిన ‘కార్తికేయ’కు సీక్వెల్ చేయాలని చందూ మొండేటి భావించాడు.
Must Read ;- మంచి కబురు చల్లగా చెప్పిన కార్తికేయ
‘కార్తికేయ 2’ చేయడానికి నిఖిల్ కూడా ఉత్సాహాన్ని చూపించడంతో, కథపై గట్టిగానే కూర్చున్నాడు. కథ కొత్తగా .. ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో, విశ్వప్రసాద్ – అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా ముందుకు వచ్చారు. ఒక శుభముహూర్తాన ఈ ప్రాజెక్టును ప్రకటించారు .. కాన్సెప్ట్ వీడియోను కూడా వదిలారు. ‘ద్వాపరయుగం‘ నాటి ఒక రహస్యాన్ని ఇప్పుడు ఛేదించే ప్రయత్నం .. స్వార్థశక్తులను అడ్డుకునేందుకు కథానాయకుడు చేసే పోరాటం చుట్టూ ఈ కథ నడుస్తుందనే విషయాన్ని స్పష్టం చేశారు.
అయితే ఆ తరువాత కరోనా విజృంభించడం .. సినిమాల నిర్మాణాలు వాయిదా పడటం జరిగిపోయింది. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గుతూ వస్తోంది. దాంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే, కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘కార్తికేయ 2′ ప్రాజెక్టులోను కదలిక మొదలైందని అంటున్నారు. అటు ’18 పేజెస్’ సినిమాతో పాటే నిఖిల్ ఈ సినిమాను కూడా చేయనున్నాడు. అయితే విడుదల పరంగా చూసుకుంటే, ’18 పేజెస్’ తరువాతనే ‘కార్తికేయ 2’ థియేటర్లకు రానుందని తెలుస్తోంది.
Also Read ;- మలయాళీ భామ అనుపమ జోరు తగ్గినట్టేనా?