తల్లి.. తన ఫోన్‌లో పెట్టుకున్న వాట్సాప్ స్టేటస్‌తో పోలీసులు వచ్చి ఆమె కొడుకును పట్టుకెళ్లారు. ఈ స్టేటస్‌లో ఉన్న ఫోటోకు 15 నెలల క్రితం జరిగిన ఓ క్రైమ్‌కు సంబంధం ఉంది. అసలు విషయం ఇక్కడ ఏమిటంటే.. సాయికిరణ్ అనే వ్యక్తి గుడికి వెళ్లి తన ఇంటికి వచ్చేలోపు అతని ఇంటి తలుపులు బార్ల తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూసేసరికి తన ఇంట్లో బంగారం దొంగతనం జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాచకొండ పోలీసు స్టేషన్ పరిధిలో 2019 జులై 12 లో నమోదైన ఆ కేసు విచారణ దశలోనే ఉండిపోయింది.
అయితే 15 నెలల క్రితం నమోదైన నగలు చోరీ కేసు వ్యవహారం ఒక్క వాట్సాప్ స్టేటస్‌తో కొలిక్కివచ్చినట్లయింది. ఈ వ్యాట్సాప్ స్టేటస్ నగలు చోరీ కేసును చేధించడానికి పోలీసులకు ఉపయోగపడింది. ఇన్ని రోజుల తరువాత బాధితుని ఇంటి పక్కన ఉండే మహిళ వీళ్ల ఇంట్లో పోయిన నగను పెట్టుకుని ఉన్న ఫోటోను వాట్సాప్ ద్వారా షేర్ చేసింది. దాన్నే స్టేటస్ కూడా పెట్టుకున్నట్లు తెలిసింది. ఇది చూసిన సాయికిరణ్ ఆ నగ తమదేనని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేయగా ఆమె కుమారుడు జితేందరే ఆ దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. దొంగలించడమే కాకుండా ఆ నగలు తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చినట్లు తేలింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
మనం చేసే తప్పులు ఎంత దాచాలనుకున్నా అవి దాగవు. అవి ఎప్పుడో ఒకప్పుడు మన ద్వారానే బయటపడతాయనేదానికి ఇదే నిదర్శనం.