గత కొంత కాలంగా బాలీవుడ్ లో అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. అందులో ముఖ్యంగా డ్రగ్స్ కేసు, సుశాంత్ ఆత్మహత్య కేసుపై ఎక్కువ రచ్చ జరుగుతోంది. డ్రగ్స్ కేసులో ఇప్పటికే అనేకమందిని అధికారులు అరెస్ట్ చేశారు. పెద్ద స్టార్ హీరోలు, హీరోయిన్లు అని చెప్పుకునే వారు కూడా ఈ డ్రగ్స్ కేసులో ఉండడం విశేషం.
ఇక అసలు విషయానికి వస్తే బాలీవుడ్ కు చెందిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అకాల మరణం మొత్తం దేశ వ్యాప్తంగా ఎంతటి విషాదాన్ని నెలకొల్పిందో తెలిసిందే. కొంతమంది ఇది ఆత్మహత్య అంటుంటే మరికొంతమంది ఇది హత్య అంటున్నారు. ముఖ్యంగా ఆయన అభిమానులు మాత్రం ఇది ముమ్మాటికి హత్యే అంటున్నారు. సుశాంత్ అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చెయ్యడంతో ఈ కేసును సిబిఐకు అప్పగించింది ప్రభుత్వం. సిబిఐ కూడా ఈ కేసును అంత సీరియస్ గా తీసుకోలేదనే వార్తలు వినిపించాయి.
మెల్లగా ఈ కేసు పక్కదారి పట్టడం మొదలైంది. సుశాంత్ కేసు పక్కకు వెళ్లిపోయి డ్రగ్స్ కేసు ముందుకు రావడంపై అనేక మంది రిపోర్టర్లు బహిరంగానే సిబిఐను ప్రశ్నించారు కూడా. అయినా ఫలితం లేకుండా పోయింది. కానీ ఇటీవల మళ్ళీ ఈ కేసుపై రచ్చ మొదలైంది. సుశాంత్ మరణానికి న్యాయం దొరికి తీరాలని నెటిజన్లు పెద్ద ఎత్తున నినదిస్తున్నారు.
సుశాంత్ మరణంపై సిబిఐ ఎందుకు ఎలాంటి అప్డేట్ ఇంకా ఇవ్వలేదు అని వారు ప్రశ్నిస్తూ మరోసారి సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. కావాలనే సిబిఐ ఈ కేసును పక్కదారి పట్టిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. వెంటనే ఈ కేసుపై సిబిఐ అప్డేట్ విడుదల చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. అంతే కాకుండా సెక్షన్ 302 ప్రకారం కేసును తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సుశాంత్ కేసుపై నెటిజన్ల ప్రశ్నలకు సీబీఐ అధికారులు సమాధానం చెప్తారో లేదో చూడాలి మరి.