నెల్లూరు వైసీపీలో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయా ? ఆ తాజా, మాజీ మంత్రులు మధ్య విబేధాలు అక్కడి వర్గ రాజకీయాలకు కారణమవుతున్నాయా ? అధిష్టానం వార్నింగ్ ను సైతం లెక్క చేయకుండా ఎవరికి వారు తమ జతలతో వేరు కుంపట్లు పెట్టేశారా ? అధికార పార్టీలో చీలికలకు కారణమవుతున్న ఆ నేతలు ఎవరు ? ఇంతకీ నెల్లూరు రాజకీయాల్లో ఏం జరుగుతోంది ?
మంత్రివర్గ విస్తరణ తర్వాత నెల్లూరు రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీలో ఉన్న విభేధాలను బయటపెడుతోంది. తాజా మాజీ మంత్రి అనిల్, ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిల మధ్య వైరం జిల్లాలో గ్రూపు రాజకీయాలకు దారి తీస్తున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎవరికి వారు తమ తమ జట్లను ఏర్పాటు చేసుకోవడంతో వర్గపోరు ముదురుతోందనే చర్చ జోరందుకుంది.
2019 ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ కుమార్ యాదవ్, జగన్ క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు. మూడేళ్ళ పాటు ఆయన ఏపీ జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు.అనిల్ మంత్రిగా ఉన్నంత కాలం సర్వేపల్లి నియోజకవర్గంలోకి అడుగుపెట్టనివ్వలేదు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఆఖరికి ప్రభుత్వ కార్యక్రయమలు అయినా తన అనుమతి లేనిదే రానిచ్చేది లేదన్నట్టుగా ఆయన వ్యవహారం ఉండేదట.
ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కాకాణికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కింది.వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన జిల్లాకు వచ్చిన రోజే ఊహించని పరిణామం ఎదురయ్యిందట. మంత్రి ర్యాలీకి ధీటుగా మాజీమంత్రి అనిల్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.దీంతో బహిరంగ సభ ద్వారా అనిల్ బలప్రదర్శనకు దిగారనే టాక్ బలంగా వినిపించింది. ఈక్రమంలోనే మంత్రి కాకాణికి వ్యతిరేకంగా పదవి ఆశించి భంగపడ్డ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలతో కలిసి తన వర్గాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కూడా చేశారట. అయితే శ్రీధర్ రెడ్డి కానీ, ప్రసన్న కుమార్ రెడ్డి కానీ ఎక్కడా ఈ విషయంలో స్పందించలేదు. జగన్ వెంటే తమ బాటని తేల్చేశారట.దీంతో అనిల్ ఒంటరి అయిపోయాదనే చర్చ జిల్లా రాజకీయ వర్గాలలో జోరందుకుంది.
మరోవైపు కాకాణికి మద్దతుగా సీనియర్ నేత ఆనం రాంనారాయణ రెడ్డి నిలవడంతో వైసీపీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయనే వాదన బలపడింది. దీంతో ఈ గ్రూపు రాజకీయాల అంశం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో హై కమాండ్ వారికి గట్టి వార్నింగ్ ఇచ్చిందని టాక్. అయితే అప్పటికి సైలెంట్ అయిపోయిన అనిల్ మళ్ళీ కొత్త వివాదానికి తెరతీశారట. నెల్లూరు సిటీలో ఫ్లెక్సీలు తొలగింపు పేరుతో వార్ కి తెరలేపారనే చర్చ జోరందుకుంది. ముఖ్యంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కాకాణిని ఆనం తన ఇంటికి ఆహ్వానించారు.అయితే స్థానిక ఎమ్మెల్యే అయిన అనిల్ కు మాత్రం ఈ కార్యక్రమానికి ఆహ్వానం లభించలేదట.దీంతో అనిల్‌పై ఆయన నియోజకవర్గంలో కాకాణి తొలిదెబ్బ పడినట్లే అనే ప్రచారం జరుగుతోందట. ఈ క్రమంలోనే నెల్లూరు సిటీలో ఆనం అనుచరులు మంత్రి కాకాణికి స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా ,అనిల్ వర్గీయులు ఆ ఫ్లెక్సీలు అన్నింటినీ తొలగించేశారట. దీంతో నెల్లూరులో మళ్ళీ వార్ మొదలిందనే చర్చ జోరందుకుంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే నెల్లూరు సిటీ పై పట్టు కోసం మాజీమంత్రి అనిల్, సీనియర్ ఎమ్మెల్యే ఆనం చేస్తున్న ప్రయత్నాలతో సింహపురి రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయనే చర్చ జోరందుకుందట. ముఖ్యంగా ఇద్దరు నేతలు పేల్చుకుంటున్న మాటల తూటాలతో జిల్లాలో గ్రూపు తగాదాలు ముదురుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. మూడేళ్ళలో జిల్లా ఇరిగేషన్ శాఖలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని ఆనం వ్యాఖ్యానించగా.. చాదస్తం పెరిగి రోజుకో పార్టీ మారే వారు మాట్లాడే మాటలు నేను పట్టించుకోను అంటూ అనిల్ కౌంటర్ ఇచ్చారట. అదేసమయంలో తనకి ఒక పార్టీ లైన్ ఉందని, ఆ గీత దాటితే తనను ఎవరూ తట్టుకోలేరని అనిల్ ఏకంగా వార్నింగ్ ఇచ్చారట.
ఇక నేతల తీరు క్యాడర్ కు పెద్ద తలనొప్పిగా మారిందట. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా ఇప్పుడు నెలకొన్న రచ్చ ఎటువైపు దారితీస్తుందో అనే భయం వారిని వెంటాడుతోందట. కాగా సొంత పార్టీ నేతల మధ్య నెలకొన్న వర్గ విబేధాలు ప్రతిపక్షాలకు అనుకూలంగా మారే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారట. ఇప్పటికైనా అధిష్టానం ఈ అంశంపై సీరియస్ గా దృష్టి సారించి , సమస్యకు పరిష్కారం చూపకపోతే రాబోయే రోజుల్లో ఇది పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారే ప్రమాదం ఉందని బహిరంగంగానే చర్చించుకుంటున్నారట.
మరి నెల్లూరులో రాజుకుంటున్న రాజకీయ రగడ పై వైసీపీ హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి…