వివాదాలు ముందు పుట్టి బయోపిక్ లు తర్వాత పుడతాయా? బయో పిక్ లు పుట్టాకే వివాదాలు పుడతాయా? ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పడం కష్టమే.
ముఖ్యంగా బయోపిక్ ల విషయంలోనే ఎక్కువగా వివాదాలు తలెత్తుతుంటాయి. ఒకవిధంగా బయోపిక్ లు తెరకెక్కించాలంటే కత్తి మీద సామే. ఈ వ్యవహారం ఒక్కోసారి కోర్టు మెట్లు ఎక్కేదాకా వెళుతుంది. ఓ సినిమా విషయంలో ఏర్పడిన వివాదం ఎక్కిడికి దారితీస్తుందో అర్థం కావడం లేదు. ఆ సినిమా పేరు ‘800’. శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ కు సంబంధించిన బయో పిక్ ఇది. ఆ పాత్రను తమిళ హీరో విజయ్ సేతుపతి పోషిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదలైన మరుసటి రోజు నుంచే వివాదాలు మొదలయ్యాయి.
ట్రైన్ మోషన్ పిక్చర్స్, డార్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎం.ఎస్. శ్రీపతి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాత్రను పోషించవద్దంటూ విజయ్ సేతుపతి మీద ఒత్తిడి తీసుకువస్తున్నారు. అసలు ఈ పాత్రను అంగీకరించినందుకే ఆయన మీద నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఒక నమ్మక ద్రోహి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించవద్దని విజయ్ సేతుపతికి దర్శకుడు భారతీరాజా సూచించిన విషయం తెలిసిందే.పలు తమిళ సంఘాలు కూడా ఈ దేశద్రోహి పోషించవద్దంటూ డిమాండ్ చేస్తున్నాయి. సాధారణంగా నటుల ఎంపిక పాత్రలను బట్టే ఉంటుంది.
ఎవరు ఏ పాత్రకు సూటవుతారన్నదాన్ని బట్టి ఆయా నటులను ఎంపిక చేస్తారు. మహాత్మా గాంధీ బయోపిక్ సినిమా చేస్తున్నపుడు బెన్ కింగ్ స్లే అనే హాలీవుడ్ నటుడిని తీసుకున్నారు. ఒకరికి దేశద్రోహి అయిన వ్యక్తి ఇంకొకరికి దేశ భక్తుడు కావడానికి అవకాశమెక్కువ. గాంధీని చంపిన గాడ్సేని ఒకప్పుడు శత్రువుగా చూశారు. అసలు గాడ్సే మంచి వాడని, అతడిని సమర్థించేవారు ఇప్పుడు బయలు దేరారు. వ్యక్తి దృష్టి కోణం బట్టే మంచిచెడులు ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ నరసింహారెడ్డి సినిమాలో నటించారు. నరసింహారెడ్డి మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు అతడిని దొంగ అంటే మరికొందరు దేశభక్తుడు అన్నారు. ఇలాంటి వివాదాలు ఎప్పుడూ ఉండేవే. సినిమా అనేదాన్ని కళగానే చూడాలి.
ఎన్నెన్నో బయోపిక్ లు
ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో బయోపిక్ లు వస్తున్నాయి. ఇలాంటివి తీసే టప్పుడు వారి అనుమతి, లేదా వారి వారసుల అనుమతి తీసుకోవాలి. చాలామంది అలాంటివేవీ లేకుండానే సినిమాలు తీసేస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో రాంగోపాల్ వర్మ అలాంటి ప్రయత్నాలే ఎక్కువ చేస్తున్నారు. ఆయన సినిమాలు అన్నీ వివాదాలే. కోర్టు మెట్టు ఎక్కిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇది బయోపిక్ ల యుగం.. వరుసగా ఎన్నో బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. కథలు లేక సినిమా కదల్లేకపోతోందని అనుకోడానికి వీల్లేదు. ప్రేక్షకులు కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. మరో పక్క బయో పిక్ లను ఆదరిస్తున్నారు.
ఆయా బయో పిక్ వసూలు చేసిన కలెక్షన్లే ఇందుకు ఉదాహరణం. ఇలాంటి బయోపిక్ చిత్రాలు మంచి ఎపిక్ ల్లా మిగిలిపోతున్నాయి. నిర్మాతలకు కూడా మినమమ్ గ్యారంటీ అన్న నమ్మకాన్ని ఇస్తున్నాయి. ‘800’ ( చదవండి: మురళీధరన్ బయోపిక్ ‘800’ మోషన్ పోస్టర్ విడుదల ) సినిమా విషయానికి వస్తే అందులో సినిమాకి కావలసిన మసాలా చాలానే ఉంటుంది. నిర్మాతలు ఆ కోణంలో కూడా ఈ సినిమా తీయాలని అనుకుని ఉండవచ్చు. ఇంతకుముందు ఎం.ఎస్. ధోనీ బయోపిక్ కూడా మంచి వసూళ్లు సాధించింది. ఈ సినిమా చేయడంలో తప్పొప్పులను ఎంచుకునే సమయం మాత్రం ఇది కాదు. తప్పు క్రికెటర్ మురళీధరన్ దా? ఆ పాత్ర చేయడానికి అంగీకరించిన విజయ్ సేతుపతిదా?
సినిమా అనేది కూడా ఆటే.. ఇంకోటి క్రికెట్ ఆట. ఆట ఏదైనా ఆటలాగే చూడాలా.. ఇందులోనూ ప్రాంతీయ భేదాలు ఉంటాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కారణంగా తమిళ సినిమా పరిశ్రమ రెండుగా చీలే వాతావరణం కూడా కనిపిస్తోంది. ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా విజయ్ సేతుపతిని ఈ సినిమా చేయవద్దని అంటున్నారు. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ మాత్రం విజయ్ సేతుపతికి మద్దతుగా నిలిచారు. ‘జనాలకు పనేమీ లేదా.. ఒక నటుడిని, క్రికెటర్‌ను కలపడం అర్థం లేని వివాదం. ముత్తయ్య మురళీధరన్‌ను కోచ్‌గా నియమించిన ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ప్రజలు ఎందుకు ప్రశ్నించడం లేదు’ అంటూ రాధిక ట్వీట్ చేశారు.
ఈ విషయాన్ని తను వివాదం చేయాలనుకోవడం లేదని, నటులకు న్యాయపరమైన మద్దతు ఇవ్వాలన్నదే తన ఉద్ధేశమని ఆమె పేర్కొన్నారు. మరో వైపు ఈ సినిమా విషయంలో శ్రీలంక క్రికెటర్ మురళీధరన్ ( చదవండి: శ్రీలంక తమిళుడిగా పుట్టడం నా తప్పా: మురళీధరన్ ) కూడా హర్ట్ అయినట్లు కనిపిస్తోంది. దీనిపై ఆయన తన సుదీర్ఘమైన వివరణను కూడా ఇచ్చారు. తన తప్పేమిటో అర్థం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సినిమా విషయంలో ఇంతటి గందరగోళం నెలకొనడం ఎవరికీ మంచిది కాదు. దీనికి ముగింపు పలకాల్సిన బాధ్యత తమిళ సినీ పెద్దల మీద ఉంది.
– హేమసుందర్ పామర్తి











