కింగ్ నాగార్జున.. కాలం కలిసి రాకపోతే కింగ్ అయినా మరొకరైనా చేసేదేమీ లేదు. 64 ఏళ్ల వయసు, 27 ఏళ్ల సినిమా కెరీర్.. సినిమాల సంఖ్య 99.. అక్కినేని వారసుడిగా నాగార్జున వెనుకబడిపోవడం ఆయన అభిమానులకే రుచించడం లేదు. ఈరోజు ఆయన పుట్టిన రోజు. ది ఘోస్ట్ తర్వాత కొత్త సినిమా ప్రకటన ఈరోజు వచ్చింది. నా సామి రంగ అంటూ అప్ డేట్ ఇచ్చేశారు. పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల చేశారు. అంతా బాగానే ఉంది. సరైన హిట్ చూసి నాగ్ కు ఎన్ని రోజులైందో.
ఊపిరి తర్వాత ఆయన ఊపిరి తీసుకోకుండా సినిమాలు చేసినా సరైన హిట్ లభించలేదు. నిర్మలా కాన్వెంట్, ఓంనమో వేంకటేశాయ, రాజుగారి గది 2, ఆఫీసర్, దేవదాసు, మన్మధుడు 2, వైల్డ్ డాగ్, బంగార్రాజు, ది ఘోస్ట్, బ్రహ్మస్త్ర.. ఇలా అన్నీ ఫ్లాపులే. హీరోగానే కాదు నిర్మాతగానూ వెనుకబడి పోయారు. ఒక్క బిగ్ బాస్ హోస్ట్ గా మాత్రమే ఇప్పుడు నాగార్జునను చూస్తున్నారు. మళ్లీ వెండి తెర మీద వెలిగిపోవాలన్న తపనతో తాజాగా నా సామి రంగ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దించుతున్నారు.
కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో నా సామి రంగ తెరకెక్కుతోంది. ఈ ప్రచార చిత్రం చూస్తుంటే నాగార్జున కట్టూ బొట్టూ డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్ లోనే కనిపిస్తున్నాయి. తనదైన స్టయిల్ లో బీడీ కాల్చుకుంటూ రౌడీలను దుమ్ము లేపేసినట్టుగా ఈ గ్లింప్స్ వదిలారు. ఈసారి పండక్కి నా సామి రంగ అంటూ ఓ డైలాగ్ కూడా చెప్పించారు. ‘ఆళ్లు మామూలోళ్లు కాదన్నా.. పులులు’.. ‘అన్నా ఆడి చెయ్యి తీసేయాలా? కాలు తీసేయాలా? ఏకంగా తల తీసేయమంటావా? ఎవడన్నా ఆడు’ అంటూ రౌడీలు డైలాగులు చెబుతంటూ నాగ్ ఎంట్రీ ఇచ్చాడు. ఎలివేషన్ మాత్రం ఓ రేంజ్ లోనే ఉంది. అదే రౌడీల గుంపులోనే ఉన్న నాగ్ తన తలపైన ముసుగు తీసి రగ్డ్ గడ్డంతో నవ్వుతూ ఎంట్రీ ఇచ్చాడు.
‘లోపల ఉంది పులుల గుంపు కాదురా.. మేకల గుంపు’ అంటూ డైలాగ్ రావడం.. కింగ్ వారందరినీ చితక్కొట్టడం లాంటి సీన్లు చూపించారు. మొదట్లో ఈ సినిమాకి బెజవాడ ప్రసన్న కుమార్ దర్శకుడు అని ప్రకటించారు. కానీ విజయ్ బిన్నిని ఈ అవకాశం వరించింది. నేను లోకల్, ధమాకా లాంటి చిత్రాలకు కథను అందించిన ప్రసన్న కుమార్ ఈ సినిమాకి కథను మాత్రమే అందించారు. పలాస దర్శకుడు కరుణ కుమార్ కూడా ఇందులో ఓ కీలక పాత్ర పోషించినట్టు గ్లింప్స్ చూస్తే అర్థమైంది. ఓ మాస్ కంబ్యాక్ కోసం నాగార్జున ప్రయత్నిస్తున్నట్టు ఈ గ్లింప్స్ చూస్తేనే తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల రూపొందించే సినిమాలో నాగార్జున ఓ కీలక పాత్ర పోషించనున్నారు. బహుశా ఇది 100 వ సినిమా కావచ్చు.