మీరు నమ్మి తీరాల్సిందే. అలా ఎలా జరుగుతుంది? చచ్చిపోయిన వాళ్లు వచ్చి ఇసుక తవ్వుకోవడం ఏమిటి? ట్రాష్ కాకపోతే అని మీరు ప్రశ్నించడానికి వీల్లేదు. అలా ప్రశ్నిస్తే కుదర్దు. ఎందుకంటే ప్రభుత్వ రికార్డుల ప్రకారం అలాగే ఉంది మరి.. వివరాలు కావాలంటే.. పూర్తిగా చదవాల్సిందే..
గుంటూరు జిల్లాలో మరో వైసీపీ ఎమ్మెల్యే భాగోతం బయట పడింది. వేమూరు నియోజకవర్గం ఈపూరు గ్రామంలో పట్టా భూముల్లో మేట వేసిన ఇసుక తవ్వుకుంటామంటూ రైతుల్ని నిండా ముంచారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన కార్యాలయ చిరునామాతో గనులశాఖ అధికారులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తుల మూలకర్తగా, సదరు ఎమ్మెల్యే తన బినామీలతో దరఖాస్తు చేయించారనేది స్థానికంగా వినిపిస్తున్న ఆరోపణ.
తొమ్మిది మంది రైతుల పట్టా భూముల్లో ఇసుక మేటలు వేశాయని ఇసుక తవ్వుకునేందుకు అనుమతివ్వాలని గనుల శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ఐదు శాఖల అధికారులు ఆగమేఘాలపై అనుమతులు మంజూరు చేశారు. అనుమతి లభించిందే తడవుగా ఇక ఆ ఎమ్మెల్యే బినామీలు రెచ్చిపోయారు.
ఎంత తవ్వారు
పట్టా భూముల్లో తవ్విన ఇసుకను ఏపీఎండీసీ ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులకు సరఫరా చేయాలి. కానీ సదరు ఎమ్మెల్యే బినామీలుగా ప్రచారంలో ఉన్నవారు మాత్రం ఆ పని చేయలేదు. నేరుగా గుంటూరు, విజయవాడలోని బడా బిల్డర్లతో ఒప్పందం చేసుకుని రోజుకు 2000 టన్నుల ఇసుకను వారికి సరఫరా చేశారు. దాదాపు ఎనిమిది నెలల కాలంగా ఈ అరాచకం కొనసాగుతూనే ఉంది. అధికారులు మాత్రం కన్నెత్తి చూడలేదు. కేవలం ఆరు నెలలకే అనుమతులిచ్చినా నేటికీ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇలా అక్రమ తవ్వకాల ద్వారా సదరు తెరవెనుక ఉన్న నేత దాదాపు రూ.40 కోట్లు వెనకేశారని స్థానికులు చెబుతున్నారు. ఇంత పిండుకున్నా సదరు ఆయనకు రైతులు కనిపించలేదు. రైతుల పట్టాభూముల్లో ఇసుక తవ్వితే సదరు రైతులకు టన్నుకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. నేటికీ ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి చెల్లించలేదని భూములిచ్చిన రైతులు వాపోతున్నారు.
చచ్చినా వదల్లేదుగా
ఈపూరులో తొమ్మిది మంది రైతుల భూముల్లో మేట వేసిన ఇసుక తవ్వకాలకు అనుమతులు తీసుకున్న సదరు తెరవెనుక నాయకుడు బినామీలు చనిపోయిన రైతులకు కూడా వదల్లేదు. ఎప్పుడో 2016 చనిపోయిన ఇద్దరి రైతుల పేర్లను కూడా గనుల శాఖకు సమర్పించిన దరఖాస్తులో పొందుపరిచారు. అంటే చనిపోయిన రైతుల భూములను కూడా వదలని పెద్దలు, చివరకు ఆ రైతుల నోట్లో మట్టికొట్టారు.
అంతేకాదు సమీపంలోని పెట్రోల్ పంపులో ఇసుక రవాణా వాహనాలకు కోటిన్నర వరకూ డీజిల్ పోయించుకుని వారికీ ఒక్క రూపాయి చెల్లించకపోవడంతో విషయం బయటకు వచ్చింది. ఈ దందా వెనుక పార్టీ పెద్దల ఆశీస్సులు కూడా అతనికి పుష్కలంగా ఉండటంతో ఎవరూ నోరెత్తి మాట్లాడలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఇంకా తవ్వుతాం…
ఇప్పటికీ ఈ అరాచకం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. అధికార పార్టీ పెద్దలకు పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించడం వల్లే అతని అరాచకాలు కొనసాగుతున్నాయని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇంత జరుగుతున్నా గనుల శాఖ, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడటం లేదని ఈపూరు రైతులు అభిప్రాయపడుతున్నారు.