నారా లోకేష్..ఈ పేరు ఇప్పుడు ఏపీలో ఓ బ్రాండ్‌గా మారింది. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి తీవ్ర అవమానాలను ఎదుర్కొన్న లోకేష్ ఇప్పుడు ఏపీలో పొలిటికల్ ఫైర్ బ్రాండ్‌గా మారాడు. తండ్రి చంద్రబాబుపై కేసులు, మరోవైపు పార్టీ నేతలపై దాడులు ఇలా వైసీపీ కుట్రలను చేధించి టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా అనే అనుమానాల నుంచి తెలుగుదేశం పార్టీకి చరిత్రలోనే ఘనమైన విజయాన్ని కార్యకర్త మీసం మెలేసేలా చేశాడు.
ఇటీవల 42వ పుట్టిన రోజు జరుపుకున్న లోకేష్…12 ఏళ్ల క్రితం 2013లో తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ అధినేత కొడుకుగా కాకుండా కార్యకర్తలలో ఒకడిగా ఉంటూ, అందరికి దగ్గరై పార్టీలో అంచెలంచెలుగా ఎదిగాడు. తనను తాను నిరూపించుకున్నాడు. మొదట్లో పార్టీ యువజన విభాగానికి నేతృత్వం వహించారు లోకేష్. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు. ఎమ్మెల్సీగా వచ్చిన అవకాశంతో ఐటీ మంత్రిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగానూ రాష్ట్రానికి ఎన్నో అవార్డులు సాధించిపెట్టారు. ఇక 2019లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు లోకేష్.
ఐతే పట్టుబట్టి మంగళగిరిలాంటి టఫ్ సీటును ఎంచుకున్న లోకేష్ ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఐనప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఓటమితో కుంగిపోలేదు. ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు..మరింత దూకుడుగా పని చేసి విజయం సాధించాలని నిర్ణయించుకున్నారు. గడిచిన ఐదేళ్లు వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మంగళగిరిలో పార్టీ కేడర్‌ను లాక్కున్నా లోకేష్ వెనుకడుగు వేయలేదు. ఐదు సంవత్సరాలపాటు మంగళగిరిలోనే ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఇంటి తలుపు తట్టాడు. ఓడిన చోటే గెలవాలన్న పట్టుదలతో 2024లో జరిగిన ఎన్నికల్లో మంగళగిరిలో బ్రహ్మాండమైన మెజార్టీతో విజయం సాధించారు. ఎంతలా అంటే తనను విమర్శించినా ప్రతి నోరు మూయించేలా ఈ గెలుపు రీసౌండ్ వినిపించింది. దాదాపు 91 వేల మెజార్టీతో వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు.
లోకేష్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ ఆయనను టార్గెట్ చేసింది. సోషల్‌మీడియాలో, సొంత మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేసింది. దిగజారి లోకేష్ శరీరాకృతిని సైతం విమర్శించింది. లోకేష్‌కు కనీసం మాట్లాడడం కూడా రాదంటూ ఎద్దేవా చేసింది. ఆయనను మానసికంగా దెబ్బతీసేందుకు వైసీపీ చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ లోకేష్ ఏనాడూ కుంగిపోలేదు. తనను తాను నిరూపించుకునేందుకు అనుక్షణం కష్టపడ్డాడు. కరోనా లాక్డౌన్ కారణంగా దొరికిన టైంలో తనను తాను మలుచుకున్నాడు. పార్టీ కార్యకర్తలు సైతం ఆశ్చర్యపోయేలా బరువు తగ్గి స్లిమ్ అయ్యాడు. స్టైల్ కూడా మార్చాడు. తెలుగు భాషపై పట్టు సాధించి అనర్గళంగా, గుక్క తిప్పుకోకుండా మాట్లాడే స్థాయికి చేరుకున్నాడు.
2019-24 తెలుగుదేశం పార్టీకి కష్టకాలం. చంద్రబాబు తర్వాత పార్టీకి నాయకత్వం ఎవరు అన్న ప్రశ్నకు లోకేష్ సమాధానంగా నిలిచాడు. చంద్రబాబును టార్గెట్ చేసి వైసీపీ జైలులో పెట్టడంతో పార్టీకి పెద్దదిక్కుగా మారాడు లోకేష్. కార్యకర్తలకు అండగా ఉంటూ, నేతలకు భరోసా కల్పిస్తూ భవిష్యత్తు ఆశాకిరణంగా నిరూపించుకున్నాడు. తండ్రిని జైలు నుంచి విడిపించుకునేందుకు తీవ్రంగా శ్రమించాడు. వైసీపీ కక్షపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా లోకేష్ మొదలుపెట్టిన యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపుతిప్పింది. ఏపీలో దాదాపు 3 వేల 132 కిలోమీటర్ల పాదయాత్ర చేసి జగన్ రాక్షసపాలనపై సమరశంఖం పూరించాడు లోకేష్. తద్వారా టీడీపీకి పూర్వవైభవం తీసుకువచ్చాడు. 2019 ఎన్నికల్లో టీడీపీని 23 స్థానాలకే పరిమితం చేశామని విర్రవీగిన వైసీపీని కేవలం 11 స్థానాలకు పరిమితం అయ్యేలా చేయడంలో లోకేష్‌దే కీలకపాత్ర.
ప్రస్తుతం ఏపీ కేబినెట్లో ఐటీ మినిస్టర్‌గా సేవలందిస్తున్న లోకేష్..ఎక్కడ ఏ ఇబ్బంది ఏర్పడినా, తానున్నానంటూ కార్యకర్తలకు భరోసా కల్పిస్తున్నాడు. పార్టీ నేతలకు సైతం దిశానిర్దేశం చేస్తున్నాడు. తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా నారా లోకేష్ నిరూపించుకున్నాడు. లోకేష్ పొలిటికల్ జర్నీ ఓ స్ఫూర్తి పాఠంగా నిలుస్తుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు











