ఎన్నికలకు ముందు మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు నారా లోకేష్. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల పట్టాలతో పాటు నూతన వస్త్రాలు అందజేసి గౌరవిస్తానని ఎన్నికలకు ముందు మాట ఇచ్చారు లోకేష్. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 3 నుంచి 12వ తేదీ వరకు మన ఇల్లు – మన లోకేష్ కార్యక్రమం ఏర్పాటు చేసి పేదలకు పట్టాలు అందజేయనున్నారు. తొలి విడతగా 3 వేల మందికి వారు నివాసముంటున్న ఇంటిపై హక్కు కల్పించనున్నారు.
మంగళగిరి ప్రాంతంలో దశాబ్ధాలుగా ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న వారికి గతంలో ఎంతో మంది నాయకులు హామీలు ఇచ్చారు. కానీ అమలు చేయలేదు. ఐతే ఇదే అంశాన్ని ఎన్నికలకు ముందు ప్రధానాంశంగా ఎంచుకున్న లోకేష్..ఆ హామీని అమలు చేసే దిశగా కార్యాచరణ రెడీ చేశారు. మొదటి దశలో మొత్తం 3000 ఇళ్లకు పట్టాలు అందించనున్నారు.
ఈ నెల 3న మొదటి పట్టాను ఉండవల్లి గ్రామంలో అందజేయనున్నారు లోకేష్. నారా లోకేష్ స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పట్టా అందజేసి మన ఇల్లు – మన లోకేష్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 4 నుంచి మంగళగిరిలోని డాన్ బాస్కో స్కూల్‌ను ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన వేదికపై లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేస్తారు. 4వ తేదీన మంగళగిరి మండలం ఎర్రబాలెం, నీరుకొండ, కాజ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంత్రి లోకేశ్ ఇళ్లపట్టాలు, నూతన వస్త్రాలు అందజేస్తారు. 7న తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం, కొలనుకొండ, పద్మశాలీబజారు ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు, 8న మంగళగిరి రత్నాలచెరువు ప్రాంతం, మహానాడు-2కు చెందిన వారికి, 11న సీతానగరం, తాడేపల్లి సలాంసెంటర్, నులకపేట డ్రైవర్స్‌కాలనీ నుంచి ఎంపికైన వారికి, 12న మహానాడు-1, ఉండవల్లి కూడలి ప్రాంతాల్లోని అర్హులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. మంగళగిరి నియోజకవర్గం విషయంలో లోకేష్ స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే లోకేష్ మాట ఇస్తే నెరవేర్చుతాడన్న అభిప్రాయం నియోజకవర్గ ప్రజల్లో నెలకొంది.