టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటానని గతంలో ఇచ్చిన మాటను ఆయన మరోసారి నిలబెట్టుకున్నారు. ఒక్క మెసేజ్ చేస్తే చాలు కార్యకర్తల అవసరాలు తీరుస్తూ లీడర్ అని నిరూపించుకుంటున్నారు. తాజాగా మరో ఘటన లోకేష్ గొప్ప మనసుకు ఊదాహరణగా నిలిచింది.
ఇంతకీ ఏం జరిగింది?
ఐ-టీడీపీ కార్యకర్త వేల్పుల వెంకటేష్ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యాయత్నం చేశాడన్న విషయం మంత్రి నారా లోకేష్ దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన నారా లోకేష్ వెంకటేష్ చికిత్సకు అవసరమయ్యే ఖర్చంతా తామే భరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. వెంకటేష్ కుటుంబ బాధ్యతను వ్యక్తిగతంగా తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు లోకేష్.
ఈ సందర్భంగా కార్యకర్తలకు సైతం ప్రత్యేక విజ్ఞప్తి చేశారు లోకేష్. ఏదైనా కష్టమొస్తే ధైర్యంగా నిలబడి ఎదుర్కొవాలన్నారు. ఆవేశంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకుని, కుటుంబాలను రోడ్డున పడేయొద్దని, బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చేతులు జోడించి కోరుతున్నానన్నారు.
ఎలాంటి కష్టమొచ్చినా ఒక్క మెసేజ్ చేస్తే పరిష్కరించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. తాను ఒక్క మెసేజ్ దూరంలోనే ఉన్నానన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తన దృష్టికి రాని సమస్యల పరిష్కరానికి త్వరలోనే ఓ ప్రత్యేక ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేస్తానని కార్యకర్తలకు మాట ఇచ్చారు లోకేష్. ఎలాంటి కష్టమొచ్చినా స్నేహితులతో, బంధువులు లేదా కుటుంబసభ్యులతో గానీ, పార్టీ నేతలతో గానీ షేర్ చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కార్యకర్తలకు మాట ఇచ్చారు లోకేష్. ఏ కష్టమొచ్చినా వ్యక్తిగతంగా, తానూ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. గతంలోనూ టీడీపీ వీరాభిమాని శ్రీనివాస్ సూసైడ్ చేసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు లోకేష్. అంతే కాదు పెద్దన్నగా ఆ కుటుంబ బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. కేవలం కార్యకర్తల విషయంలోనే కాదు ఎలాంటి సమస్య తన దృష్టికి వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు లోకేష్ ముందుకు వస్తున్నారు. ఇటీవల బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువతికి సంబంధించిన అవయవాలను తిరుపతికి తరలించాలంటే వ్యక్తిగత ఖర్చుతో ప్రత్యేక హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసి తన గొప్ప మనసు చాటుకున్నారు.