మహానాడు సాక్షిగా టీడీపీ యువనేత, మంత్రి లోకేష్ విసిరిన చాలెంజ్ ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారుతోంది.. ఉర్సా కంపెనీకి విశాఖలో 99 పైసలకే భూమి కేటాయించారని, అది లోకేష్ బినామీ కంపెనీ అని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.. ఈ ఆరోపణలపై ఇప్పటికే పలుమార్లు సమాధానం చెప్పిన లోకేష్, తాజాగా జగన్ సొంత జిల్లా కడప గడప సాక్షిగా సవాల్ విసిరారు.. 99 పైసలకే తమ సర్కార్ ఉర్సా కంపెనీకి భూములు కేటాయించినట్లు నిరూపిస్తే, మంత్రి పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధమని ప్రకటించాడు లోకేష్..
విశాఖలో సాఫ్ట్ వేర్ పరిశ్రమ ప్రోత్సాహం కోసం, ఇప్పటికే దక్షిణాదిన అందనంత ఎత్తులో దూసుకుపోతున్న హైదరాబాద్, బెంగళూరుతో పోటీ పడి ఇక్కడికి కంపెనీలను తరలించడానికి ఏపీ సర్కార్ చాలెంజింగ్ నిర్ణయాలకు సిద్ధం అయింది.. టీసీఎస్ లాంటి బడా కంపెనీలను ఆహ్వానిస్తోంది.. వారు పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయ్యారు.. ఇటు, వేల ఉద్యోగాల కల్పనకు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు.. దీనికోసం ప్రపంచంలోనే టాప్ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఒకటయిన టీసీఎస్‌కి విశాఖలో భూమిని కేటాయించారు. 99 పైసల నామమాత్రపు ధరకే ఈ భూములని టీసీఎస్ లాంటి ప్రసిద్ధ సంస్థకు ఇచ్చింది కూటమి సర్కార్..
టీసీఎస్‌తోపాటు ఉర్సా అనే మరో సంస్థకి కొంత భూమిని కేటాయించింది ఏపీ ప్రభుత్వం.. ఇందులో కొంత భాగాన్ని ఎకరాకి 50 లక్షల రూపాయలకు, మరికొంత భాగాన్ని ఎకరాకి కోటిన్నరకు అప్పగించింది కూటమి సర్కార్.. అయితే, ఈ రెండు కంపెనీలను వేరు వేరుగా చూపించకుండా కేవలం రాజకీయ ఆరోపణలు చేస్తున్నాడు వైసీపీ అధినేత జగన్.. ఉర్సా కంపెనీని, టీసీఎస్‌ని ఒకే గాటన కట్టలేదని, రెండు వేరు వేరు కంపెనీలుగా భావించి భారీ వ్యత్యాసం చూపించారు ఏపీ ప్రభుత్వ పెద్దలు.. అయినా, రాజకీయ లబ్ది కోసం ఫేక్ ప్రచారం చేస్తున్నాడు జగన్.. దీనికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న లోకేష్.. మహానాడు వేదికగా లక్షలాది మంది కార్యకర్తల సమక్షంలో వైసీపీ నేతలకి సవాల్ విసిరారు..
అంతేకాదు, జగన్ లిక్కర్ స్కామ్‌పైనా లోకేష్ స్పందించారు.. దొంగే దొంగ అన్నట్లు జగన్ తీరు ఉందని, వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌ని తమవైపుకు తిప్పుతున్నాడని, జగన్ అరాచకం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు లోకేష్.. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని షేక్ చేసిన మద్యం కుంభకోణంపై ఎంతో పారదర్శకంగా, నిష్పాక్షకంగా సమగ్ర దర్యాప్తు జరుగుతోందని తెలిపారు లోకేష్.. ఇప్పటికే ఈ స్కాములో ఎంతోమంది జైలుపాలయ్యారని, వారిపై విచారణ జరుగుతోందని వివరించారు..
రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు లోకేష్.. 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పన తమ ధ్యేయమని, రాబోయే నాలుగేళ్లలో అది సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ యువనేత, విద్యాశాఖ మంత్రి.. మరి, లోకేష్ సవాల్‌కి జగన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..











