ఏపీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ ఢిల్లీ పర్యటన చేయడం ఆలస్యం ఎన్నో ఆశాజనక పరిణామాలు జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించగా.. అక్కడ లోకేశ్ ఎన్డీయే కీలక నేతలను కలిశారు. ఎన్డీయేలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. పలు రాజకీయ అంశాలతో పాటు, రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్ర పెద్దలతో చర్చించేందుకు లోకేష్ ఢిల్లీలో పర్యటించారు. గతంలో ఎప్పుడైనా ఢిల్లీకి సీఎం చంద్రబాబు వెళ్లేవారు. ఇప్పుడు నారా లోకేష్ వెళ్తుండడం చాలా ప్రాధాన్యం సంతరించుకుంది.
నారా లోకేష్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపు మేరకు ఢిల్లీలో పర్యటించి వచ్చారు. ఆయన అలా ఢిల్లీ వెళ్లి వచ్చారో లేదో ఏపీ ఖజానాలోకి రూ.వేల కోట్లు వచ్చి పడ్డాయి. గత కేంద్ర బడ్జెట్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు కావాల్సిన మేర నిధులను కేటాయించిన సంగతి తెలిసిందే. ఒక్క అమరావతి నిర్మాణం కోసమే రూ.15 వేల కోట్లు ప్రకటించారు. దీన్ని రుణం ద్వారా ప్రపంచ బ్యాంకు ద్వారా ఇప్పిస్తున్నట్లుగా ప్రకటించారు. వాటికి కేంద్రమే పూచీకత్తుగా కూడా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలోనే స్పష్టం చేశారు.
ఇంకా ఏపీలో పలు కారిడార్ల డెవలప్ మెంట్ కు సహకారంతో పాటు వెనకబడ్డ ప్రాంతాలు, కరవు జిల్లాలకు ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. గత కేంద్ర బడ్జెట్‌లో ఇవి ప్రకటించగా.. తాజాగా వాటికి సంబంధించిన నిధులు ఏపీ ఖజానాలో పడుతున్నట్లుగా తెలిసింది. నారా లోకేశ్ ఢిల్లీ పర్యటన తర్వాతనే ఈ పరిణామం చోటు చేసుకుంది. అంతేకాక, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కూడా ఇటీవల రెండుసార్లు అమరావతిలో పర్యటించి, చంద్రబాబును కూడా కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే.
రాజధాని నిర్మాణం కోసం వరల్డ్ బ్యాంకు నుంచి కేంద్ర ప్రభుత్వం ఇప్పిస్తున్న రూ.15 వేల కోట్లు నిధులు కూడా అతి త్వరలో రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం వేగవంతం అయినట్లుగా తెలిసింది. మొత్తానికి నారా లోకేశ్ ఢిల్లీలో అటు రాజకీయ అంశాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాలను కూడా సెట్ చేసి వచ్చినట్లుగా భావిస్తున్నారు.











