ఏపీలో ప్రతి వర్గానికి న్యాయం చేస్తున్నామని, ఆయా వర్గాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకుంటున్న జగన్ సర్కారు.. మెజారిటీ వర్గాలను నయా మోసానికి గురి చేస్తున్న వైనాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బట్టబయలు చేస్తున్నారు. స్పాంటేనిటీతో లోకేశ్ సంధిస్తున్న విమర్శలకు జగన్ సర్కారుకు నిజంగానే దిమ్మ తిరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని.. అందరి కంటే ముందుగా లోకేశ్ తనదైన శైలి స్పాంటేనిటీని చూపి జగన్ బండారాన్ని బయటపెట్టారు. చేనేత కార్మికుల కుటుంబాలకు టీడీపీ హయాంలో మెరుగైన లబ్ధి జరిగితే.. ఇప్పుడు అంతకంటే మెరుగైన పరిస్థితి కల్పిస్తున్నామని చెబుతున్న జగన్ సర్కారు ఏం చేస్తున్న దానిపై లోకేశ్ తన ట్వీట్ లో బట్టబయలు చేశారు.
లోకేశ్ ట్వీట్ లో ఏముందంటే..?
‘‘చేనేత సోదరులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. మోసపు నేతలో వైఎస్ జగన్ చేయి తిరిగిన కళాకారుడు. గతంలో నేతన్నకు ఏడాదికి సుమారు 50 వేలకు పైగా వచ్చే ప్రోత్సాహకాలను, రాయితీలను ఆపేసి.. రూ.24 వేలను చేతిలోపెట్టి పండగ చేసుకోమంటున్నారు. అది కూడా అందరికీ లేదు. ఆప్కో కొనుగోళ్లు ఆగిపోయాయి. మజూరీ, రాయితీలు ఆగిపోయాయి. సొంతంగా మగ్గం ఏర్పాటుకు రూ.1.5 లక్షల సబ్సిడీ రుణం ఇమ్మని, ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి నెలకు 10,000 రూపాయలు కరోనా సాయం ఇచ్చి ఆదుకొమ్మని ఈ ముఖ్యమంత్రిని ఎన్నో సార్లు అడిగాను.కనీసం ఇప్పటికైనా తెలుగుదేశం డిమాండ్లను జగన్ రెడ్డి పరిశీలించి నేతన్నను ఆదుకోవాలి. ప్రతి నేత కార్మికునికి ‘నేతన్న నేస్తం’ అందించడంతో పాటు అదనంగా గతంలో తెలుగుదేశం ఇచ్చిన ప్రోత్సాహకాలు, రాయితీలు కొనసాగించాలి’’ అని లోకేశ్ ఆ ట్వీట్ లో డిమాండ్ చేశారు.
బాబుదీ అదే మాట..
లోకేశ్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన కాసేపటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు. ‘‘పోగును వస్త్రంగా మలిచి.. మానవాళికి నాగరికతను నేర్పిన చేనేత సోదరులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ లో గత తెలుగుదేశం పాలనలో నేతన్నలకిచ్చే త్రిఫ్టును 8 నుండి 16 శాతానికి పెంచాం. నూలుపై సబ్సిడీని 10 నుండి 40శాతానికి పెంచాం. చేనేత సహకార సంఘాలకు పావలా వడ్డీ రుణాల రాయితీ అమలు చేశాం. పనులు లేని వర్షాకాలానికి భృతి అందించాం. 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చాం. ఆదరణతో పనిముట్లు అందజేసి అండగా నిలిచాం. తెలుగుదేశం హయాంలో నాటి పరిస్థితుల్ని, వైసీపీ ప్రభుత్వంలో నేతన్నల నేటి దుస్థితిని తలచుకుంటే మనసు కలచివేస్తోంది. ఏపీలో చేనేత కార్మికులకు ఏడాదికి రూ.50వేలకు పైగా వచ్చే రాయితీలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి రూ.24 వేలతో సర్దుకోమంటూ తీరని ద్రోహం చేస్తోంది. నేతన్నల అభివృద్ధిని, అభ్యున్నతిని ఈ ప్రభుత్వం ప్రశ్నార్థకం చేస్తోంది. నాడు చేనేతలకు స్వర్ణయుగంగా ఉన్న పథకాలను రద్దుచేసి చీకట్లలోకి నెట్టేశారు. తెలుగుదేశం హయాంలో అందించిన ప్రోత్సాహకాలు, రాయితీలు నేతన్నలకు ఇవ్వాలి. అలాగే కరోనాతో నష్టపోయిన కార్మికులకు పరిహారం కూడా అందజేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను’’ అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.