జగన్ సర్కార్ పై జనం తిరగబడుతున్నారా ? మంత్రులు, ఎమ్మెల్యే ల పర్యటనలో ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత స్పష్టమవుతోందా ? జగన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న గడప గడపకు వైసీపీ ఎలా సాగుతోంది ? ఏపీ సిఎం పాత , కొత్త మంత్రులతో నిర్వహించిన తొలి క్యాబినెట్ లో ఎదురైన అనుభవం ఏమిటి ?
ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం సిఎం జగన్ మోహన్ రెడ్డి తాజా మాజీ, కొత్త మంత్రులతో క్యాబినెట్ నిర్వహించారు. ఈ సమావేశంలో అనేక అంశాలను చర్చించారని సమాచారం. కాగా ఈ సమావేశంలో మంత్రులు , ఎమ్మెల్యేల నుంచి జగన్ కు ఊహించని పరిణామం ఎదురయ్యిందనే చర్చ రాజకీయ వర్గాలలో జోరందుకుంది.
ప్రధానంగా ఈ సమావేశంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఇళ్ళ స్థలాలు, ప్రభుత్వం పై ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత వస్తోంది.. దాన్ని రూపుమాపేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ? అదేసమయంలో జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గడప గడపకు ఎలా సాగుతోంది ? ఎలా నిర్వహించాలి అనే అంశాలపై తన సహచర మంత్రుల వద్ద ఆయన ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
కాగా తాజామాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులతో తొలి సమావేశం నిర్వహించిన జగన్, అధికారిక సమావేశం అనంతరం మంత్రులు, మాజీ మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారట. ఈ సంధర్భంగా పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గడప గడపకు కార్యక్రమం రెండవ రోజే పేలవంగా సాగడం పై ఆయన వారిని ప్రశ్నించారట. అయితే మంత్రులు, మాజీలు చెప్పిన సమాధానం తో జగన్ ఖంగుతిన్నారట. వర్షం కారణంగా కార్యక్రమం నిర్వహించలేకపోయాం అని కొందరు చెప్పగా, తమకు మెటీరీయల్ అందలేదని కొందరు, తాము ఇంకా పూర్తి స్థాయిలో ప్లానింగ్ చేసుకోలేదని ఇంకొందరు జగన్ కు చెప్పారట.
వాస్తవానికి మే 12 వ తేదీ నుంచి జులై 8 న జరిగే వైసీపీ ప్లీనరీ వరకు ఈ గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇప్పటికే జగన్ పార్టీ నాయకులకు ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులకు సిఎం జగన్ సంతకం చేసిన ఒక లేఖను కూడా ఇస్తామని,దానిని నేతలు సదరు లబ్దిదారులకు అందజేయాలని కూడా గతంలోనే చెప్పారు.ఇందులో భాగంగా మే 12 న రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా మొదలయిన రెండో రోజే దాదాపు వంద నియోజకవర్గాల్లో గడప గడపకు నిలిచిపోయిందనే సమాచారం వైసీపీ కేంద్ర కార్యాలయానికి చేరిందట. దీనికి పార్టీ నేతలు చెబుతున్న కారణం కాదని, ప్రజల నుంచి ప్రభుత్వం పై వస్తున్న వ్యతిరేకతే కారణమనే చర్చ వైసీపీ వర్గాలలో జరుగుతోందట.
ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు ఇచ్చారో ఆకక్డి నుంచే ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వినిపిస్తోందట. ప్రభుత్వం లక్షా 80 వేల రూపాయలు ఇస్తున్నప్పటికీ అవి కేవలం చదును చేయించుకోవడానికే సరిపోతున్నాయని, ఇళ్ళు ఎలా నిర్మించుకోవాలంటూ క్షేత్ర స్థాయిలో ప్రజలు మంత్రులను, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులను నిలదీస్తున్నారట. అదే సమయంలో చెత్త పన్ను, పెరిగిన కరెంట్ ఛార్జీలు, కరెంట్ కోతలు, రోడ్ల అధ్వాన పరిస్థితుల పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు గడప గడపకు వచ్చిన నాయకులను నేరుగా తీసుకెళ్ళి పరిస్థితులపై నిలదీస్తున్నారట. అదేసమయంలో రాయలసీమ ప్రాంతంలో నీటి ఎద్దడి , రేషన్ కార్డుల ఆధారంగా పెన్షన్ లు, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలలో లబ్దిదారుల సంఖ్యలో కోత విధించడం పై ప్రజలు మండిపడటం తో మొఖం చెల్లక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు , నాయకులు ఈ కార్యక్రమానికి వెళ్లలేకపోతున్నారట.
ఇదిలా ఉంటే ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనారిటీ వర్గాల నుంచి కూడా జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత తీవ్రంగా వ్యక్తమవుతోందట. కార్పొరేష ల నుంచి తమకు ఎటువంటి రుణాలు రావడం లేదని ఈ సందర్భంగా ఆయా వర్గాల వారంతా నేతలను బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారట. ఇక జాబ్ మేళ ద్వారా ఉద్యోగాలు ఇస్తున్నప్పటికీ డిగ్రీ, పీజీ చదువుకున్న తమకు 5 నుంచి 10 వేలు వచ్చే సెక్యూరిటీ ఉద్యోగాలు ఇవ్వడమేమీటని ప్రశ్నిస్తున్నారట. ఇక తాము అధికారంలోకి వస్తే వ్యవసాయాని ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన జగన్, నేడు మోటార్ లకు మీటర్లు పెట్టేందుకు సిద్ధం అవ్వడం పై రైతాంగం నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందట. మంత్రులు, ఎమ్మెల్యే లు గడప గడపకు వెళ్ళిన సమయంలో రైతులు వారిపై తిరుగుబాటు ప్రదర్శిస్తున్నారత. మీరు చెప్పింది ఏమిటి చేస్తున్నది ఏమిటని గట్టిగా కడిగేస్తున్నారట. అయితే జగన్ మాత్రం మంత్రులు ఎమ్మెల్యే లు ఖచ్చితంగా గడప గడపకు వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని, టిడిపి సానుభూతి పరుల ఇళ్లకు కూడా వెళ్ళి తీరాల్సిందే అని చెప్పడం పై వారంతా పెదవి విరుస్తున్నారట. నియోజకవర్గానికి కోటి రూపాయల చొప్పున నిధులు ఇస్తామని చెప్పినా ఇప్పటికీ అవి ఇవ్వలేదు, ఏ మొఖా పెట్టుకుని ప్రజల్లోకి వెళతామని వారంతా చర్చించుకుంటున్నారట.
మొత్తం మీద జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గడప గడపకు కార్యక్రమం ప్రారంభమైన తొలి రోజే వైసీపీ నేతలకు చుక్కలు చూపించిందనే అభిప్రాయాలు వ్యక్తంఅవుతున్నాయి. మరి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే అధినేత ఆదేశాన్ని పార్టీ నేతలు పాటిస్తారా ? ప్రజల్లో నాయకులకు ఎటువంటి అనుభవాలు ఎదురవుతాయి తెలియాలంటే వేచి చూడాల్సిందే.