నయనతార ఏ ముహూర్తంలో కథానాయికగా అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఇంతవరకూ ఆమె వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. కొంతకాలం వరకూ అందాలు ఆరబోయడానికి ఎంతమాత్రం వెనుకాడని నయనతార, ఆ తరువాత నటన ప్రధానమైన పాత్రల వైపు ఎక్కువగా మొగ్గుచూపడం మొదలుపెట్టింది. ఒక వైపున సీనియర్ స్టార్ హీరోల సరసన చేస్తూనే, మారో వైపున కొత్తగా ఎంట్రీ ఇచ్చిన కుర్ర హీరోలతో చేయడానికి కూడా వెనుకాడని ఆత్మవిశ్వాసం నయనతార సొంతం. తన స్టార్ డమ్ విషయంలో ఆమె నమ్మకం ఆశ్చర్యాన్ని కలిగించకమానదు.
ఇక ఈ మధ్య ఆమె లేడీ ఓరియెంటెడ్ కథలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వెళుతోంది. ఈ నేపథ్యంలో ఆమె నుంచి ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్లు .. హారర్ థ్రిల్లర్లు వస్తున్నాయి. ఆమె చేసిన ఈ సినిమాలు స్టార్ హీరోల సినిమాలతో సమానమైన బిజినెస్ ను జరుపుకుంటూ, నయనతార మార్కెట్ ఏ రేంజ్ లో ఉందనేది చెబుతున్నాయి. నాయిక ప్ర్రధానంగా ఆమె చేసిన సినిమాలు తెలుగులోను భారీ విజయాలను అందుకుంటున్నాయి. ఇక మలయాళం నుంచి కూడా ఆమెను వెతుక్కుంటూ ఈ తరహా సినిమాలే వస్తున్నాయి. ‘నిళల్‘ సినిమాను అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
నయనతార అభిమానులందరి దృష్టి ఇప్పుడు తమిళంలో ఆమె చేసిన ‘నేత్రికన్‘ సినిమాపై ఉంది. ఈ సినిమాలో ఆమె అంధురాలిగా నటించింది. అంధురాలైన ఆమె ఒక సీరియల్ కిల్లర్ బారి నుంచి ఎలా తప్పించుకుంది? ఎలా అతని ఆటకట్టించింది? అనేదే కథ. ఇక ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే ఆమె మరో సస్పెన్స్ థ్రిల్లర్ ను పట్టాలెక్కించింది. జీఎస్ విఘ్నేశ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా, కోయంబత్తూరులో రెండవ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. త్వరలోనే టైటిల్ ను ప్రకటించనున్నారు. తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు.
Must Read ;- నయనతార నీడ.. అంచనాలు అందుకున్నట్టేనా?