New Pace At Secretariat Construction :
కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి తొలి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాలా విచిత్రంగా వ్యవహరిస్తారు. సీఎం హోదాలో ఉన్నా కూడా ఆయనకు మూఢ విశ్వసాలు ఎక్కువన్న మాట ఎప్పటి నుంచో వినిపిస్తున్నదే. ఈ మూఢ నమ్మకాల్లో భాగంగానే వాస్తుకు అమిత ప్రాధాన్యం ఇచ్చే కేసీఆర్.. ఏడేళ్లకు పైగా సీఎంగా ఉంటున్నా.. ఒకసారో, రెండు సార్లో మాత్రమే ఆయన రాష్ట్ర పాలనకు కేంద్ర బిందువుగా నిలిచిన సచివాలయానికి వచ్చారు. ఎందుకంటే.. సచివాలయం వాస్తు సరిగా లేదని, అలాంటి సచివాలయానికి వస్తే.. ఇతర నేతల మాదిరే తాను కూడా పదవీచ్యుతుడిని అవుతానన్నభయం కేసీఆర్‌ను వెంటాడుతోందట. అందుకే కాబోలు.. పాత సచివాలయాన్ని కూల్చేసి నగరంలోనే ఇంకో చోట కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. ఆ పనులు ఇప్పుడు వేగంగా సాగుతున్నాయి.
అప్పుడే ఫస్ట్ ఫ్లోర్ పూర్తి
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యాలయాన్ని ఒకే చోట ఉండటమే కాకుండా.. ఏ శాఖకు చెందిన అన్ని రాష్ట్ర స్థాయి విభాగాలు ఒకే చోట ఉండేలా కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రానున్న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి సచివాలయ నిర్మాణం పూర్తి అయ్యేలా పనులు జెట్ స్పీడుతో సాగుతున్నాయి. ఈ క్రమంలో అప్పుడే ఫస్ట్ ఫ్లోర్ మేర నిర్మాణాలు పూర్తి అయ్యాయట. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ నిన్న అధికారులు, మంత్రులలను వెంటేసుకుని సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులకు పలు సలహాలు, సూచనలు చేశారట.
పాత సచివాలయం వాస్తుదోషమిదే
ఈ సందర్భంగా పాత సచివాలయంలో ఉన్న వాస్తు దోషమేమిటి? దాని కారణంగానే కేసీఆర్ ఏకంగా కొత్త సచివాలయాన్ని కడుతున్నారు కదా.. ఇందులో ఆ దోషాన్ని ఎలా పరిష్కరించారు? అన్న విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. పాత సచివాలయానికి దక్షిణ మార్గంలో ప్రధాన గేటు ఉండగా.. ఆ తర్వాత తూర్పు దిశగా ఇంకో గేటును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ గేటు నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. గతంలో దక్షిణం దిశగా ఉన్న గేటు నుంచే సీఎంలు, మంత్రులు రాకపోకలు సాగించేవారు. ఈ గేటు వాస్తు దోషం కిందకే వస్తుందట. అందుకే కేసీఆర్ పాత సచివాలయాన్ని తొక్కి చూడటం లేదని చెబుతున్నారు. మరి కొత్త సచివాలయంలో ఈ దోషాన్ని ఎలా సరిచేశారన్న విషయానికి వస్తే.. సీఎం, మంత్రుల కోసం ఉత్తర దిశలో ప్రధాన గేటును ఏర్పాటు చేశారట. అంతేకాకుండా అధికారులు, సిబ్బందికి ఓ గేటు, సందర్శకులకు మరో గేటును కూడా ఏర్పాటు చేస్తున్నారట. మొత్తంగా పాత సచివాలయంలోని వాస్తు దోషంగా ఉన్న ప్రధాన గేటును తనకు అచ్చి వచ్చిన దిశగా మార్చుకుంటున్న కేసీఆర్.. కొత్త సచివాలయానికైనా ఇక రెగ్యులర్ గా వస్తారా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.











