మూడు రోజుల క్రితం హాట్ హాట్ గా జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులపై ఓ రేంజిలో ఫైరైన సంగతి తెలిసిందే కదా. టీడీపీ, బీజేపీ విమర్శలను తిప్పికొట్టే విషయంలో మంత్రులు అసలు శ్రద్ధ చూపడం లేదని ఆరోపించిన జగన్..ఇకపై కూడా అలాగే కొనసాగితే కుదరదని స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు. ఇకపై ప్రతి అంశాన్ని కూడా తాను మదింపు చేస్తానని, ఆ మదింపులో అనుకున్న మేర ఫలితాలు సాధించని మంత్రులపై వేటు తప్పదన్న రీతిలో కూడా జగన్ పరోక్షంగానే హెచ్చరికలు జారీ చేశారు. అందులోనూ ప్రత్యేకించి ముగ్గురు మంత్రుల పేర్లను చెప్పిన జగన్.. వారికి మరింత గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు మంత్రులు ఎవరు అన్న రీతిలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే కేబినెట్ భేటీ జరిగిన మరునాడే ఓ ముగ్గురిలో ఓ మంత్రి బయటపడిపోయారు. ఆయన మరెవరో కాదు.. జగన్ సొంత జిల్లా కడపకు చెందిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషానే.
ఆది నుంచి నోరే పెగలదు
జగన్ సొంత జిల్లా కడపకు చెందిన అంజాద్ బాషా.. కడప సీటు నుంచే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నగరంలో మైనారిటీల ప్రాబల్యం నేపథ్యంలో అటు వైఎస్సార్ గానీ, ఇటు జగన్ గానీ.. కడప సీటును మైనారిటీ వర్గానికి చెందిన నేతలకే టికెట్ ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో 2019లో కడప నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అంజాద్ బాషా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మైనారిటీ కోటా కింద ఏకంగా జగన్ కేబినెట్ లో డిప్యూటీ సీఎం పదవిని కూడా దక్కించుకున్నారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆయన పర్యవేక్షిస్తున్నారు. అయితే ఎప్పుడూ జనంలోకి వచ్చి అంజాద్ బాషా ఓ నాలుగు మాటలు మాట్లాడిన సందర్భం లేదనే చెప్పాలి. జగన్ కేబినెట్ లో ముద్దపప్పు ఎవరైనా ఉన్నారా అంటే.. అది అంజాద్ బాషానేనన్న వాదనలు కూడా వినిపించాయి. అసలు అంజాద్ బాషాను చూస్తుంటే. ఈయన ఎలా రాజకీయాల్లో రాణిస్తున్నారో, ఈయన ఎమ్మెల్యేగా ఎలా గెలిచారోనన్న అనుమానాలు రాక మానవు.
ఇలా బయటపడ్డారు
ఇక కేబినెట్ భేటీలో ముగ్గురు మంత్రులను వేలెత్తి మరీ చూపిన జగన్.. వారి వైఖరి మారాలని వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. దీని ఫలితమేనన్నట్లుగా అప్పటిదాకా పెద్దగా మీడియా ముందుకు రాని అంజాద్ బాషా. శనివారం నాడు మీడియా ముందుకు వచ్చి బీజేపీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మాట్లాడింది రెండు మాటలే అయినా.. బీజేపీని ఓ మతతత్వ పార్టీగా అభివర్ణించి అంజాద్ బాషా కలకలమే రేపారు. అంజాద్ బాషా మీడియా సమావేశం తర్వాత కేబినెట్ భేటీలో జగన్ ఆగ్రహం వక్తం చేసిన మాట నిజమేనని, మంత్రులకు వార్నింగ్ లు పడ్డాయన్న మాట కూడా నిజమేనని తేలిపోయింది. ఇలా జగన్ హెచ్చరికల తర్వాత మీడియా ముందుకు వచ్చి అంజాద్ బాషా దొరికిపోతే.. మిగిలిన ఇద్దరు ఎప్పుడు బయటపడతారోనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- బీజేపీ, వైసీపీలు ఇక ప్రత్యర్థులేనా?











