రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాకు చెందిన బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా సంచలన వ్యాఖ్యలే చేస్తారు. అసలు టీజీ మీడియా ముందుకు వస్తున్నారంటేనే.. అంతా ఆసక్తిగా చూస్తారు. అలాంటిది తెలుగు రాష్ట్రాల మధ్య రాయలసీమ సాగు నీటి ప్రాజెక్టులపై నెలకొన్న వివాదం నేపథ్యంలో టీజీ మీడియా ముందుకు వస్తే.. అన్నీ సంచలన వ్యాఖ్యలే వినిపిస్తాయి కదా. అదే జరిగింది. కాస్త ఆలస్యంగానే ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చిన టీజీ వెంకటేశ్.. తెలంగాన సీఎం కేసీఆర్ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఓ అదిరేటి లాజిక్ తీసుకొచ్చి కేసీఆర్ ను ఇరుకున పెట్టారనే చెప్పాలి.
కరోనాతో కేసీఆర్ మెదడు దెబ్బతిన్నది
అయినా కేసీఆర్ పై టీజీ చేసిన సంచలన వ్యాఖ్యలేమిటంటే.. కరోనా కారణంగా కేసీఆర్ కు మెదడు దెబ్బతిన్నదని టీజీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగా నీటి పంపకాలకు సంబంధించి ఇరు రాష్ట్రాలు చేసుకున్న ఒప్పందాలను కేసీఆర్ మర్చిపోయారని ఎద్దేవా చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుదుత్పత్తి ప్రాజెక్టు మాత్రమే అని తెలంగాణ నేతలు అంటున్నారని.. అది పవర్ ప్రాజెక్టు అయినప్పుడు దాని నీటిని సాగు నీరుగా, తాగు నీరుగా ఎందుకు వాడుతున్నారని టీజీ ప్రశ్నించారు. అసలు ఒప్పందాలను మరిచి ఇప్పుడు కొత్త వాటాల కోసం పేచీ పెట్టడం సబబు కాదని టీజీ అన్నారు.
ఏపీలో తెలంగాణ ఓట్లు లేవుగా
ఇక టీజీ తెచ్చిన అదిరేటి లాజిక్ ఏమిటంటే.. జల వివాదాలు సివిల్ వార్ కు దారి తీస్తాయన్న టీజీ.. కేసీఆర్ కు రాయలసీమ, ఆంధ్ర నాయకులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ ఓట్లు తెలంగాణలో ఉన్నాయి తప్ప.. తెలంగాణ ఓట్లు ఏపీలో లేవని ఆయన చెప్పారు. అలాంటప్పుడు అయితే గియితే కేసీఆర్ భయపడాలి గానీ.. జగన్ భయపడాల్సిన అవసరమే లేదని తనదైన శైలి లాజిక్ చెప్పారు. ఇందుకు నిదర్శనంగానే ఎన్నికల సమయంలో కేసీఆర్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తారని.. హైదరాబాద్ ఎన్నికలప్పుడు ఆంధ్ర పాట పాడి.. కరీంనగర్ ఎన్నికలప్పుడు తెలంగాణ పాట అందుకుంటారని టీజీ విమర్శించారు. ఏపీ పోలీసులు తక్షణమే యాక్షన్ తీసుకుని శ్రీశైలం డ్యామ్ ను స్వాధీనం చేసుకోవాలని టీజీ డిమాండ్ చేశారు. మరి టీజీ వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Must Read ;- కేసీఆర్, జగన్ కు రాజకీయాలే ముఖ్యం : జలవివాదంపై ‘బండి’ లేఖ!











