గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా చేసిన ‘క్రాక్’ సినిమా, ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటించిన ఈ సినిమా, హిట్ టాక్ ను సొంతం చేసుకుని అన్ని ప్రాంతాల్లో దూసుకుపోతోంది. రవితేజ – గోపీచంద్ మలినేని గతంలో ‘డాన్ శీను’ .. ‘బలుపు’ సినిమాలు చేశారు. తాజాగా చేసిన ‘క్రాక్’ సినిమాతో ఈ ఇద్దరూ హ్యాట్రిక్ హిట్ కొట్టేశారు. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ వైజాగ్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించింది.
ఈ వేదికపై రవితేజ మాట్లాడుతూ .. “సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్స్ కి జనం ఓ మాదిరిగా రావొచ్చునని అనుకున్నాము. కానీ జనం ఈ స్థాయిలో వస్తారని ఎంతమాత్రం ఊహించలేదు. లాక్ డౌన్ కి ముందు జనం థియేటర్స్ కి ఎలా వచ్చేవారో అలా వస్తున్నారు. నేను చాలా ఎనర్జిటిక్ అంటున్నారు .. కానీ నాకు ఇంతటి ఎనర్జీని ఇచ్చింది మీరే. అభిమానులే నా బలం .. ఆ విషయం మరోసారి రుజువైందంతే.
దర్శకుడు గోపీచంద్ మలినేనితో సహా అందరూ కూడా ఈ సినిమాను నా అంతటి కసితోనూ చేశారు. అందుకు ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో కలుపుకుని తమన్ నా పదకొండు సినిమాలకి పనిచేశాడు. ఈ సినిమాకి ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించే ఈ రోజున అంతా మాట్లాడుకుంటున్నారు. ఇక నేను హీరోగా చేసిన చాలా సినిమాలకి రామ్ – లక్ష్మణ్ పనిచేశారు. వాళ్లలో కష్టమే తప్ప కల్మషం కనిపించదు. వాళ్లు కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి.
కెమెరామెన్ విష్ణు గురించి చెప్పుకోవాలంటే .. అతని పనితీరు నాకు విపరీతంగా నచ్చేసింది. ఈ సినిమా మెయిన్ పిల్లర్స్ లో ఆయన ఒకరు. సాయిమాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. ‘జయమ్మ’ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ చాలా బాగా చేసింది. ఆమెలో విలనిజమే కాదు .. మంచి కామెడీ సెన్స్ కూడా ఉంది. త్వరలో మళ్లీ కలిసి పనిచేస్తాము. ‘కటారి కృష్ణ’ పాత్రలో సముద్రఖని గొప్పగా చేశారు. ఆయన మంచి నటుడు .. దర్శకుడు .. నిర్మాత .. రచయిత .. అలాంటి ఆయనతో కలిసి పనిచేసినందుకు చాలా హ్యాపీగా ఉంది” అని చెప్పుకొచ్చారు.