హిందువులు కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలకు జీఎస్టీ పన్ను మినహాయింపు ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో వ్యాఖ్యానించారు. నిబంధనల ప్రకారం..టీటీడీలో సౌకర్యాలను పరిగణనలోకి తీసుకున్నామని, ఆ క్రమంలో అలాంటి సేవలకు సంబంధంచి దేశంలో ఏ సంస్థకూ ప్రత్యేక మినహాయింపు ఉండదని వ్యాఖ్యానించారు. జీఎస్టీ మండలి సమావేశంలో ఈ అంశాలు పలుమార్లు చర్చకు వచ్చాయని వ్యాఖ్యానించారు. వైసీపీ రాజ్యసభ సభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ అంశాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
అన్ని విషయాల్లోనూ..
ఇప్పటికే పోలవరం, విశాఖ ఉక్కు, జీఎస్టీ బకాయిలు, పోర్టుల అంశాల్లో నిధులు ఇచ్చే విషయంలో కేంద్రం ప్రతికూలంగా స్పందించిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలోనూ అలాగే స్పందించింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి పన్ను మినహాయింపు కావాలని పార్టీలు, ఏపీ ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది
విజయసాయిరెడ్డి ప్రశ్నకు..
జీఎస్టీకి ముందు కొన్ని వెసులుబాట్లు ఉండేవని, జీఎస్టీ వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి భారీ మొత్తంలో జీఎస్టీ కేంద్రానికి వస్తోందని, అయితే మళ్లీ ఆ నిధులు తిరిగి రాష్ట్ర వాటాలుగా రావడం లేదని ఈ విషయంపై కేంద్రం స్పందించి తిరుమల తిరుపతి దేవస్థానానికి జీఎస్టీనుంచి మినహాయింపు కావాలని కోరారు. ప్రసాదంపై కూడా జీఎస్టీ భారం ఉందని వ్యాఖ్యానించారు. కాగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఏటా రూ.120 కోట్లకు పైగా జీఎస్టీ రూపంలో కేంద్రానికి వెళ్తున్నాయి. అయితే అందులో రూ.9కోట్లు మాత్రమే తిరిగి పంపిణీ జరుగుతోంది. ఈ క్రమంలో కొంతకాలంగా జీఎస్టీ నుంచి తిరుమల దేవస్థానాన్ని మినహాయించాలని వైసీపీ ప్రభుత్వం కోరుతోంది.
రూ.వెయ్యి దాటితే..
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై సమాధానంగా నిర్మలా సీతారామన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీకి ప్రత్యేక మినహాయింపులేవీ లేదని, అన్ని సంస్థలకు వర్తించినట్టే తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా జీఎస్టీ వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. రూ.వెయ్యి దాటి బిల్లు వసూలు చేస్తున్న విడిది కేంద్రాలకు పన్ను వర్తిస్తుందన్నారు. టీటీడీకీ ప్రత్యేకంగా మినహాయింపులు ఇవ్వలేమని తేల్చి చెప్పేశారు. అంతేకాకుండా.. ఏపీకి నిబంధలన ప్రకారం, ఆర్థిక సంఘాల సిఫారసుల ప్రకారం నిధులు విడుదల చేస్తున్నామని, ఏపీ సాధించిన పాయింట్లకు అదనంగా కొన్ని నిధులు విడుదల చేస్తున్నామన్నారు. అంటే ఏపీకి ఇవ్వాల్సిన మొత్తం కంటే.. ఎక్కువే ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. లోక్‌సభ లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారని, విజయసాయిరెడ్డి ఈ అంశంపై చాలా ఆసక్తిగా ప్రతిపాదన చేశారని వ్యాఖ్యానించారు.
ఈ ప్రసంగంలోనూ నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..ఏ రాష్ట్రానికి కూడా తాము నిధులు ఆపడం కుదరదని, జీఎస్టీ ఫార్ములా ప్రకారం ఆయా రాష్ట్రాలకు నిధులు వెళ్తాయని వ్యాఖ్యానించారు. దక్షిణాదికి నిధులు ఇచ్చే విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని కొందరు సభ్యులు చేసిన వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానానికి పన్ను మినహాయింపు విషయంలో కేంద్ర వైఖరిపై స్పష్టత వచ్చింది. ఇక రానున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పార్టీలు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాయనేది ఆసక్తికరమైన అంశంగా మారింది.