వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఈ సారి ఇంకా గట్టిగా, లోతుగా కేసుల్లో ఇరుక్కున్నారు. ఆషామాషీ ఆదాయపు పన్ను ఎగవేతకు సంబంధించిన కేసులు కావివి. ఏకంగా ఫోర్జరీ పత్రాలతో బ్యాంకును మోసం చేసిన కేసులు! కేవలం సదరు ఫైర్‌బ్రాండ్ ఎంపీ మాత్రమే కాదు.. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా కేసులో ఇరుక్కున్నారు. ఇదంతా ఫోర్జరీ పత్రాలతో బ్యాంకులకు టోకరా వేసి అప్పులు పొందడం, సుమారు 237 కోట్ల రూపాయల మేర రుణాల ఎగవేయడానికి సంబంధించిన కేసులు!
పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇండ్ భారత్ పవర్ లిమిటెడ్ కంపెనీ తరఫున.. చెన్నై ఎస్ బి ఐ నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నారు. తీసుకున్న రుణాలను చెప్పిన అవసరాలకు కాకుండా, ఇతర అవసరాలకు మళ్లించినట్లుగా ఆరోపణలున్నాయి. అదే క్రమంలో రుణం కోసం సమర్పించిన పత్రాలు ఫోర్జరీవి అని తేలినట్టు చెన్నై ఎస్ బి ఐ డిప్యూటీ జనరల్ మ్యానేజర్ ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీ రఘు రామ కృష్ణమరాజు పై సిబీఐ మరో కేసు నమోదు చేసింది. సదరు ఇండ్ భారత్ పవర్ లిమిటెడ్, డైరెక్టర్ ఎంపి రఘు రామ కృష్ణమ రాజు మాత్రమే కాదు.. ఇతర డైరెక్టర్లు కనుమూరు రమాదేవి, రాజ్ కుమార్ గంటా, దుంపల మధు సూదన రెడ్డి, నారాయణ ప్రసాద్ భాగవతుల, రామచంద్ర అయ్యర్ ల పై కూడా కేసు నమోదు అయింది. రుణంగా పొందిన రూ. 237 కోట్ల రుణాలను పక్కదారి పట్టించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
గతంలో 826 కోట్ల ఎగవేతపై సీబీఐ కేసు
ఎంపీ రఘురామక్రిష్ణ రాజుపై సీబీఐ కేసు ఇది మొదటి సారి కాదు. గత ఏడాది అక్టోబరు 9వ తేదీన ఎంపీ రఘురామక్రిష్ణ రాజుకు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో 11 ప్రదేశాల్లో దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు నిర్వహించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు, మరియు ఇతర బ్యాంకుల కన్సార్టియం ఫిర్యాదుతో నమోదు చేసిన కేసును బట్టి సీబీఐ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ సంస్థ తరఫున తీసుకున్న 826 కోట్ల రూపాయల రుణాలను నేరపూరితంగా ఎగవేయడానికి సంబంధించి ఈకేసులు నమోదు అయ్యాయి.
తాజాగా చెన్నై ఎస్బీఐ నుంచి 237 కోట్ల రూపాయల రుణాల ఎగవేతకు సంబంధించి కేసులు నమోదు అయ్యాయి.
ఈసారి ఇంకా గట్టిగా…
గతంలో 826 కోట్ల రూపాయల ఎగవేత కేసుల కంటె కూడా.. ఇప్పుడు 237 కోట్ల రూపాయల ఎగవేత కేసులు ఇంకా క్లిష్టమైనవని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో నమోదు అయిన సీబీఐ కేసు కేవలం రుణాల ఎగవేతకు సంబంధించినది మాత్రమే. అయితే.. ప్రస్తుతం.. ఫోర్జరీ పత్రాలతో బ్యాంకును మోసం చేసిన వ్యవహారం కూడా తాజా సీబీఐ కేసులో ఉంది. రుణాల ఎగవేత కేసుకం కూడా.. ఫోర్జరీ పత్రాలతో చేసిన మోసం.. క్రిమినల్ నేరంగా గట్టి కేసు అవుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
కేసులపై ‘లియో’తో ఏమన్నారంటే..?
రుణాల ఎగవేత, సీబీఐ కేసులకు సంబంధించి ఎంపీ రఘురామక్రిష్ణ రాజును.. లియోన్యూస్ చేసిన ఇంటర్వ్యూలో సూటిగా ప్రశ్నించింది. అయితే.. కంపెనీలు అన్నాక.. బ్యాంకులు, రుణాలు, ఎగవేతలు అవన్నీ చాలా సహజం అన్నట్లుగా ఎంపీ మాట్లాడారు. ఆ ఎగవేతల కేసులు కంపెనీకి సంబంధించినవి అని.. తనకు వ్యక్తిగతంగా సంబంధించినవి కావని అన్నట్లుగా ఎంపీ రఘురామ క్రిష్ణ రాజు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడడం విశేషం.
రఘురామక్రిష్ణ రాజుతో లియోన్యూస్ ఇంటర్వ్యూ చూడండి :
Must Read ;- అక్రమ కేసులపై ఎంపీ రఘురామకృష్ణంరాజు రాష్ట్రపతికి ఫిర్యాదు