త్వరలో జరగనున్న తమిళనాడు, కేరళ, పుదుశ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు రానున్నాయని ఇప్పటికే పలు సర్వేలు చెప్పాయి. తాజాగా టైమ్స్ నౌ- సీ ఓటర్ సంయుక్తగా నిర్వహించిన సర్వేలోనూ ఆ విషయమే తేలిందని సదరు సంస్థలు ప్రకటించాయి. పశ్చిమ బంగాల్‌లో మళ్లీ మమతా బెనర్జీనే సీఎం అవుతారని, కేరళలో వామపక్ష కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుందని తేల్చింది. ఈ రెండుచోట్ల బీజేయేతర పార్టీలు, కూటమిల సారథ్యంలోనే ప్రభుత్వాలు మళ్లీ ఏర్పాటవుతాయని తేల్చింది. తమిళనాడులో స్టాలిన్‌కు అవకాశం ఉందని తేల్చింది. అసోంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి కొలువుదీరనుందని, పుదుశ్చేరిలోనూ కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని తేల్చింది. ఈ సర్వే ప్రకారం బీజేపీకి ప్రస్తుతం అధికారంలో ఉన్న అసోంలో మళ్లీ అధికారం దక్కనుండగా, 30 స్థానాలు ఉన్న పుదుశ్చేరిలో కొత్తగా అధికారంలోకి రానుంది. అదే సమయంలో 234 స్థానాలు ఉన్న తమిళనాడులో బీజేపీ కూటమి అధికారం కోల్పోనుంది.
దీదీకే అధికారం..
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు బీజేపీకి మధ్య యుద్ధం తారస్థాయికి చేరింది. రాజకీయ విభేదాలు కాస్తా.. వ్యక్తిగత విభేదాల స్థాయికి చేరాయి. విద్వేషాలుగా మారే పరిస్థితి కనిపిస్తోందని చెప్పవచ్చు. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు 152 – 168 మధ్య సీట్లు వస్తాయని, బీజేపీకి 104 – 120 మధ్య సీట్లు వస్తాయని ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. వామపక్షాలు-కాంగ్రెస్-ఐఎస్ఎఫ్ కూటమి 18-26 స్థానాలకే పరిమితం అవుతుందని సర్వే తేల్చింది. అదే సమయంలో బీజేపీకి ఏకంగా 37శాతం ఓట్లు పెరుగుతాయని, టీఎంసీకి, బీజేపీకి ఓట్ల శాతంలో 2.8శాతమే తేడా ఉంటుందని తేల్చింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడు సీట్లతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక సీఎం అభ్యర్థి విషయానికి వచ్చేటప్పటికి మమతా బెనర్జీకి అత్యధిక మంది ఓటేశారు. 54.9 శాతం మంది మమత బెనర్జీకి ఓటేయగా బీజేపీ నేత దిలీప్ ఘోష్‌కు 32.3 శాతం మంది మద్దతు తెలిపారు. ముకుల్ రాయ్‌కు కేవలం 6.5 శాతం ఓట్లు దక్కగా, టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారికి కేవలం 1.3 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు. సీఎం అభ్యర్థి విషయంలో మమత బెనర్జీకి మెజార్టీ ప్రజలు జైకొట్టారని చెప్పవచ్చు.
తమిళనాడులో డీఎంకే..
తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, ఏఐఏడీఎంకే కూటమి అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుందని సర్వే చెబుతోంది. ఇక్కడ మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను డీఎంకే-కాంగ్రెస్ కూటమికి 173-181 స్థానాలు వస్తాయని, మిగతా పార్టీల కంటే ఎక్కువ స్థానాలను ఈ కూటమి గెలుచుకుంటుందని సర్వే తేల్చింది. బీజేపీ-మిత్రపక్షాలకు 45-53, ఎంఎన్ఎంకు 1-5, ఇతరులకు 0-4 సీట్లు వస్తాయని అంచనా. ఈ నేపథ్యంలో ఇక్కడ స్టాలిన్ కు ప్రజలు పట్టంగట్టనున్నారని చెప్పవచ్చు. స్టాలిన్‌కు 43శాతం మంది మద్దతు తెలిపినట్టు సర్వే వెల్లడించింది.
అసోంలో మళ్లీ కమలమే
ఐదురాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే 100కుపైగా సీట్లున్న ఏకైక రాష్ట్రం అసోంగా చెప్పవచ్చు. ఇక్కడ 126సీట్లలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే కూటమి 65-73 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ కూటమి మహాజోత్ కూటమికి 52-60 సీట్లు వస్తాయని, ఇతరులకు 0-4 మధ్య స్థానాలు వస్తాయని సర్వే తేల్చింది. ఇక్కడ హోరా హోరీ పోటీ ఉంటుందని, అయితే కొద్ది మెజార్టీతో బీజేపీ కూటమి గెలుపొందుతుందని తేల్చింది. బీజేపీ 45శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్ 41.1శాతం ఓట్లు సాధిస్తుందని, 4.9శాతం తేడా శాతం మాత్రమే తేడా ఉంటుందని తేల్చింది.
కేరళలో వామపక్షాలు..
140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో మళ్లీ వామపక్ష కూటమి కొలువు దీరనుందని సర్వే తేల్చింది. ఇక్కడ వామపక్ష కూటమి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ LDFకి 77 స్థానాలు వస్తాయని తేల్చింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు 62 స్థానాలు వస్తాయని, వామపక్ష కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని సర్వే తేల్చింది. అయితే గోల్డ్ స్కాం తోపాటు పలు కుంభకోణాలు ఆ కూటమి నేతలకు చుట్టుకున్నాయి.
కూల్చిన చోట అధికారం..
పుదుచ్చేరిలో ఇటీవలే కాంగ్రెస్ కూటమి ఏర్పాటుచేసిన ప్రభుత్వం కూలిపోయింది. రెండునెలల్లో ఎన్నికలు జరగనున్నప్పటికీ ఇక్కడ బీజేపీ వ్యూహాత్మకంగా ప్రభుత్వాన్ని కూల్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే రానున్న ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు బీజేపీ కూటమికి అధికారాన్ని కట్టబెడతారని సర్వే తేల్చింది. మొత్తం 30 స్థానాలకు గాను ఎన్డీయే 19 నుంచి 23 స్థానాలు గెలుచుకుటుందని, కాంగ్రెస్-డీఎంకే కూటమి ఈసారి 7-11 స్థానాలకు పరిమితం కానుందని సర్వే చెబుతోంది.
ఆ సర్వేల్లో..
ఇక పీపుల్స్ సర్వే పశ్చిమ బెంగాల్ లో 183 స్థానాలు గెలుచుకుని బీజేపీ అధికారంలోకి వస్తుందని, 95సీట్లకు మమత బెనర్జీ పరిమితం కావాల్సి ఉంటుందని తేల్చింది.
Must Read ;- ఎలాగైనా కాషాయ జెండా ఎగరాలి.. బెంగాల్‌లో 7లక్షల మందితో మోదీ ర్యాలీ