మంత్రి అంబటి రాంబాబు, మంగళగిరి ఎమ్ఎల్ఏ ఆళ్ల రామకృష్ణా రెడ్డి.. ఈ ఇద్దరి పేర్లు వింటే ముందుగా గుర్తుకు వచ్చేది వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ఆ ఇద్దరూ జగన్ ని అంతగా అభిమానిస్తారు, ఆరాధిస్తారు.. అలాంటి ఈ ఇద్దరు నేతలకి హ్యాండ్ ఇవ్వడానికి జగన్ రెడీ అవుతున్నట్లు ఏపీ రాజకీయాలలో ప్రచారం జరుగుతోంది.
వైసీపీలోని సుమారు 40-60 మంది ఎమ్ఎల్ఏలపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఐ ప్యాక్ టీమ్ ఇప్పటికే పలుమార్లు నివేదికలు ఇచ్చినట్లు స్వయంగా జగనే ప్రకటించారు.. వచ్చే ఎన్నికలలో వీరికి టికెట్ లు ఇచ్చే చాన్స్ లేదని వారి ముందే తెలిపారు వైసీపీ అధినేత.. ఈ లిస్టులో జగన్ నమ్మిన బంట్లుగా భావించే మంత్రి అంబటి, ఎమ్ఎల్ఏ ఆర్ కే కూడా ఉన్నారా.? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ ఎత్తులను చూస్తే ఇవి నిజం అని నమ్మక తప్పని పరిస్థితి..
సత్తెనపల్లిలో మంత్రి అంబటిపై తీవ్ర వ్యతిరేకత ఉందని భావించిన జగన్.. తన వ్యూహానికి పదును పెట్టారు.. సత్తెనపల్లి మాజీ ఎమ్ఎల్ఏ యర్రం వెంకటేశ్వర రెడ్డికి హుటాహుటిని పిలిపించి పార్టీ కండువా కప్పారు.. ఆయన గతంలో కాంగ్రెస్ లో ఉన్నారు.. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.. నియోజకవర్గంలో మంచి పట్టున్న నేతగా యర్రం వెంకటేశ్వర రెడ్డికి పేరుంది.. కార్యకర్తలకు అందుబాటులో ఉండే నేతగా చెబుతారు.. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న యర్రంని తాడేపల్లి ప్యాలెస్ కి పిలిచి కండువా కప్పారు జగన్.. దీంతో, అంబటికి ఎర్త్ పెట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది.. సత్తెనపల్లి సీటు తాజాగా వెంకటేశ్వర రెడ్డికి ఆఫర్ చేశారని తెలుస్తోంది..
ఇటు, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అసంతృప్తికి గురయినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు కానీ.. జగనే ఆయనకు ఝలక్ ఇచ్చారనే పార్టీ వర్గాలలోనే ప్రచారం జరుగుతోంది.. మంగళగిరిలో కొత్త నేతకు ప్రోత్సాహం ఇస్తున్నారు వైసీపీ అధినేత. ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరికి రాక ముందు ..తాడేపల్లిలో ఉండే దొందిరెడ్డి వేమారెడ్డి వైసీపీకి కీలక నేతగా ఉన్నారు.. ఆళ్ల ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయనను పక్కన పెట్టారు.. గతంలో జగన్ మంగళగిరి పాదయాత్ర ఖర్చులన్నీ ఆయనే భరించారు.. ఎమ్ఎల్ఏ సీటు ఇవ్వకపోయినా, ఎమ్ఎల్సీ అయినా దక్కుతుందని లెక్కలు కట్టారు వేమారెడ్డి. పార్టీ ఫిరాయించి వచ్చిన మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయిన వేమారెడ్డి ఫీల్ కాలేదు. ఇప్పుడు ఆర్కే.. మెల్లగా పార్టీకి దూరం జరుగుతూండటంతో జగన్ ఆయనను గుర్తించి మంగళగిరి వైసీపీకి అధ్యక్షుడిగా చేసేశారు. దీంతో, ఆళ్ల ఉలిక్కిపడ్డారు.. జగన్ మార్క్ ఝలక్ కి ఆళ్ల మైండ్ బ్లాంక్ అయింది..
ఇంతటితో ఆగకుండా… మంగళగిరిలో వైసీపీని గెలిపించే బాధ్యతను ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్న.. ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డికే జగన్ ఇచ్చారు. రాంకీ సంస్థ ఓనర్ అయిన అయోధ్యరామిరెడ్డి డబ్బు సమస్యే లేకుండా చేసి.. పార్టీ ని మంగళగిరిలో గెలిపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సారి తన సోదరుడు అయితే తట్టుకోలేడని ఆయన కూడా డిసైడయ్యారని అంటున్నారు. మొత్తంగా ఆళ్లకు జగన్ డోర్ మూసేశారని చెబుతున్నారు. మరి, ఇప్పటికే సోషల్ మీడియాలో కరకట్ట కమల్ హాసన్ గా పేరు తెచ్చుకున్న ఆళ్ల.. ఈ పరిణామంపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.