(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
చారిత్రక ప్రసిద్ధి గాంచి, విద్యల నగరంగా విరాజిల్లుతున్న విజయనగరంలో క్రీడాకారులకూ కొదవ లేదు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లున్నారు. అయితే వీరికి సరైన ప్రోత్సాహం, సదుపాయాలు సమకూరకపోవడంతో ఆటలకు దూరమవుతున్నారు. ప్రభుత్వ ఉదాసీనత, అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే దీనికి కారణమని స్పష్టమవుతోంది.
ఇళ్లకే పరిమితమవుతోన్న క్రీడాకారులు
విజయనగరం జిల్లాకు పలు కీలక క్రీడా ప్రాజెక్టులు మంజూరైనా అవి అందుబాటులోకి రాలేదు. ఫలితంగా జిల్లా ఖ్యాతిని విస్తరించాల్సిన క్రీడాకారులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి ఒక స్టేడియం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు రూ.2 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఆ ప్రతిపాదన అక్కడితోనే ఆగిపోయింది. 2016- 17లో అప్పటి ప్రభుత్వం ‘ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాలు’గా నామకరణం చేసింది. జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలకు కేవలం మూడు చోట్ల మాత్రమే పనులు మొదలయ్యాయి. మిగిలిన చోట్ల స్థలాన్వేషణే పూర్తికాలేదు. ఒక్కో కేంద్రానికి ఆరు ఎకరాలు అవసరమని ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో ఇండోర్ స్టేడియంతో పాటు 200 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటి నిర్మాణ ప్రగతిపై కనీస చర్చ కూడా లేకుండా పోయింది. బొబ్బిలి మండలంలోని గొల్లుపాలెం, కొత్తవలస, డెంకాడలో పనులు పునాది స్థాయిలోను, గరివిడి మండలం కోడూరు, గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరిలో స్లాబ్‌స్థాయిలోను నిలిచిపోయాయి. కురుపాం, సాలూరు, పార్వతీపురం నియోజకవర్గాల్లో అసలు స్థలమే లేదని తేల్చేశారు.
ఖోఖో-కబడ్డీ అకాడమీ ఎక్కడ..?
విజయనగరం జిల్లా పేరెత్తగానే ఖోఖో-కబడ్డీ గుర్తు కొస్తుంది. 2014కు ముందు విజయనగరంలో ఖోఖో-కబడ్డీ బాలుర అకాడమీ ఉండేది. హుద్‌హుద్ తుపానుకు భవనం కొంచెం దెబ్బతింది. ఇదే అదనుగా అకాడమీని ఎత్తేశారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక మళ్లీ అకాడమీని ప్రకటించింది. 16 నుంచి 18 ఏళ్ల లోపు క్రీడాకారులను ఇందులో చేర్చుకోనున్నారు. ఖోఖోకు 25 మందిని, కబడ్డీకి 25 మందిని తీసుకొని వారు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడానికి డీఎస్‌ఏ మైదానం పక్కన ఉన్న భవనంలో తాత్కాలికంగా వసతి ఏర్పాటు చేయాలని భావించారు. కరోనా ప్రభావంతో ఎటువంటి కదలిక లేకుండా ఆగిపోయింది. రాజీవ్ మైదానంలో గత ప్రభుత్వ హయాంలో రూ.50.50 లక్షలతో రెండు టెన్నిస్ కోర్టుల నిర్మాణం ప్రారంభించారు. 90 శాతం పనులు పూర్తయ్యాయి. సింథటిక్ కోర్టులు ఏర్పాటు చేయాల్సి ఉండగా నిధుల లేమితో పనులను ఆపేశారు. ప్రస్తుతం అక్కడ తుప్పలు మొలిచాయి.
తాత్కాలిక భవనంలోనే..
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకంగా భావిస్తున్న రాష్ట్ర క్రీడా పాఠశాలను విజయనగరానికి మంజూరు చేశారు. దీన్ని స్థానిక విజ్జీ స్టేడియంలో నిర్మాణానికి ప్రతిపాదించారు. తాత్కాలిక భవనంలో అప్పటికప్పుడు 82మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభించారు. ఇందులో 4 నుంచి 12వ తరగతి వరకు విద్యతో పాటు క్రీడా శిక్షణ నిర్వహించదలిచారు. ఉపాధ్యాయులను, శిక్షకులను, సిబ్బందిని సైతం నియమించారు. రూ.20 కోట్లతో శాశ్వత భవన నిర్మాణ పనులూ మొదలయ్యాయి. ఇంతలో కరోనా కారణంగా పిల్లలు వెనక్కి వెళ్లిపోగా, నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇటీవల రూ.10 కోట్లు మంజూరు చేశారని, త్వరలో పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయని క్రీడాకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నత్తనడకన జల క్రీడా అకాడమీ
పర్యాటకంగా జిల్లాలో కీలకపాత్ర పోషిస్తుందనుకున్న ‘జల క్రీడా అకాడమీ’ నత్తనడకన సాగుతోంది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి కేంద్రంగా 4.52 ఎకరాల స్థలంలో 2018-19లో రూ.3 కోట్లతో భవన నిర్మాణం చేపట్టారు. ఇద్దరు శిక్షకులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించారు. కొంతమంది విద్యార్థులతో తరగతులు ప్రారంభించారు. ప్రస్తుతం సాధనతో పాటు పనులు కూడా నిలిచిపోయాయి. పరికరాలు, బోట్లు అన్నీ మూలకు చేరాయి.
జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సత్వరం స్పందించి స్టేడియంల నిర్మాణానికి కృషి చేయాలని, క్రీడాకారులను ప్రోత్సహించాలని స్థానికులు కోరుతున్నారు.











