కోవిద్ 19 ఆస్పత్రుల నిర్వహణలో విశాఖ అగ్రస్థానంలో నిలిచింది. 19 అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్ ఇచ్చారు. జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ నేతృత్వంలో 19 పారామీటర్ లలో శతశాతం పాయింట్లు సాధించి మొదటి స్థానం సంపాదించింది.
ఐసియూ పడకలు, ఆక్సిజన్ పడకల నిర్వహణ, ఆసుపత్రులలో చేరిన వారిని త్వరగా కోలుకుని డిశ్చార్జి అయ్యేలా వైద్యం అందించడం, అదేవిధంగా ఆసుపత్రిలో చేరిన వారిలో మరణాలు ఎక్కువగా సంభవించకుండా కృషి చేయడం, ప్రతీరోజూ రిపోర్టులను పంపించడం, మరుగుదొడ్లను, వార్డులను శుభ్రపరచడం, నాణ్యమైన ఆహారాన్ని రోగులకు అందించడం, డాక్టర్లు , నర్సులు తరచుగా సందర్శించడం, ప్రభుత్వ వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆయా ఆసుపత్రుల సిబ్బంది మూడు షిప్టుల్లో సమర్ధవంతంగా పని చేయడం, హెల్ప్ డెస్క్ నిర్వహణ, ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్ల ఈ ర్యాంకింగ్ సాధ్యమైంది.
19 పారామీటర్స్ లో మొత్తం 2,500 పాయింట్లు కైవసం చేసుకుని విశాఖ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇది ప్రభుత్వం విడుదల చేసిన వివరాల చిట్టా.. ఇక అసలు విషయానికి వద్దాం…
విశాఖ VIMS ఆసుపత్రి వైపు పొరపాటున వెళితే… మృత్యుఘోష… కర్ణకఠోరంగా వినిపిస్తుంది. ముక్కుపుటాలు అదిరే వాసన నాసికాన్ని తాకుతుంది. రోగుల బంధువులు ఆవేదన కంటతడి పెట్టిస్తుంది. ఎప్పుడు ఏ రోగి చనిపోతాడో తెలియదు. చనిపోయిన తర్వాత ఎన్ని రోజులకు బంధువులకు సమాచారం ఇస్తారో తెలియదు. షిఫ్ట్ లో ఎంత మంది వైద్యులు ఉంటారో తెలియదు… విశాఖపట్నం, శ్రీకాకుళం విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన కోవిద్ ఆసుపత్రి విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో దుస్థితి ఇది.
అధికారులు రివ్యూలు చేపట్టడం.. వెంటనే వైద్య సిబ్బందిని నియమించి మెరుగైన సేవలు అందించండి అని చెప్పడం.. గత రెండు మూడు, మాసాలుగా షరామామూలుగా కనిపిస్తున్నది. మృతదేహాలు భద్రపరిచేందుకు సరైన వసతులు లేకపోవడం, తగినంత పారిశుద్ధ్య సిబ్బంది లేకపోవడం, రోగుల బంధువులకు సమాచారం ఇచ్చే స్పష్టమైన వ్యవస్థ లేకపోవడం, నాణ్యమైన ఆహారం అందించలేకపోవడం ఇలా అనేక ఆరోపణలతో విమ్స్ ఆస్పత్రి ఎంతో అపకీర్తిని మూటగట్టుకుంది.
స్వయంగా జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పలుమార్లు రివ్యూ నిర్వహించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదు. ఎంపీ విజయసాయిరెడ్డి ఆస్పత్రిని పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నాయని స్టేట్మెంట్ ఇచ్చేశారు. కొద్దిరోజులకే మరోమారు అక్కడికి వెళ్ళిన జిల్లా మంత్రికి రోగుల బంధువుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇప్పుడిప్పుడే విశాఖలో బెడ్ ల సంఖ్య, ఆక్సిజన్ సరఫరా వ్యవస్థలను మెరుగుపరుస్తున్నారు.
మిగతా జిల్లాల పరిస్థితి ఏంటో?
కోవిద్ 19 ఆస్పత్రులలో ఎన్నో లోపాలు ఉన్న విశాఖ ప్రథమ స్థానంలో ఉంటే … మిగతా జిల్లాల పరిస్థితి ఏంటో ఆలోచిస్తేనే భయమేస్తోంది. ఇతర జిల్లాల్లో రోగులకు ఎటువంటి సేవలు అందుతున్నాయో అర్థమవుతోంది. మొత్తంగా ఈ ర్యాంకింగ్ లు నచ్చిన అధికారులను చూసి ఇచ్చినట్టుగా ఉంది తప్ప వసతులను పరిశీలించి ఇచ్చినట్టుగా లేదు. అయితే అనేక ఫెయిల్యూర్స్ నుంచి విశాఖ జిల్లా అధికారులు మాత్రం ఎన్నో పాఠాలు నేర్చుకుని మెరుగైన వసతుల దిశగా అడుగులు వేస్తున్నారు.