హమ్మయ్య.. హైదరాబాద్ కు మళ్లీ సినిమా కళ వచ్చేసింది. ఈ సోమవారం నుంచి వరుసగా సినిమా షూటింగులతో సందడి కనిపించనుంది. ముఖ్యంగా మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మరో మూడు రోజుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హైదారాబాద్ లో అడుగుపెట్టనున్నారు. అంత వయసున్న రజనీ షూటింగ్ చేయగా లేనిది మనం మనమెందుకు ఊరికే ఉండాలి అన్న కసి యూత్ హీరోల్లో కూడా మొదలైంది. మన మెగాస్టార్ రంగంలోకి దిగితే బాగుండేదన్న మాట వినిపిస్తోంది.
అలాంటి ప్రయత్నాలు ఇంకా ఏమీ జరుగుతున్నట్లు లేవు. ‘ఆచార్య’ షూటింగ్ మొదలైనా మెగాస్టార్ రావడానికి ఇంకాస్త సమయం తీసుకోవచ్చని అంటున్నారు. అసలు ఈ సినిమాని త్వరగా పూర్తిచేయాలని చిరంజీవి తొందరపడ్డారు. కరోనా కారణంగా ఆలస్యమైంది. రాజమౌళి చేస్తున్న సినిమా చాలా ప్రతిష్ఠాత్మకమైనది. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనే నటులందరినీ క్వారంటైన్ ఉంచినట్టు తెలిసింది. అది కూడా పూర్తయిపోయిందట. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించనున్నారు.
సోమవారం నుంచి జరిగే షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొననున్నట్లు సమాచారం. మరో పది రోజులు ఆగితే సినిమాల విడుదల కూడా ప్రారంభమవుతుంది. షూటింగుల వేగం పెరగడానికి ఇది కూడా ఒక కారణం. రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ లోనే రాజమౌళి సినిమా షూటింగ్ సోమవారం నుంచి మొదలవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ పై కొన్ని సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.
రజనీకాంత్ సినిమా షూటింగ్ కూడా రామోజీ ఫిలింసిటీలోనే జరుగనుంది. చిరంజీవి కూడా రంగంలోకి దిగితే మెగా హీరోలు ఎవ్వరూ ఆగరు. వరుణ్ తేజ్ సినిమా నవంబరు 2 నుంచి ప్రారంభమవుతుంది. ఈ పరిణామాలు చూస్తుంటే తెలుగు సినిమా రంగానికి పట్టిన గ్రహణం వీడినట్లే అనిపిస్తోంది. సినిమా థియేటర్లు ప్రారంభమైతే విడుదలకు మొదటి వరుసలో ఉండేవి రామ్ ‘రెడ్’, వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’కావచ్చు. రాబోయే రెండు మూడు రోజుల్లో సినిమాల విడుదలకు సంబంధించి కూడా స్పష్టత వచ్చేస్తుంది.











