సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మన తెలుగు కుర్రాడికి చోటు దక్కింది. గత మ్యాచ్‌లో గాయపడ్డ సీమ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యర్రా పృథ్విరాజ్‌కు స్థానం లభించింది. ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ట్విట్టర్ ద్వారా ప్రకటన చేసింది. పృథ్వీ రాజ్ లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్. మంచి స్వింగ్ బౌలర్‌గా ఇతనికి రంజీ స్థాయిలో పేరుంది. ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 11 మ్యాచ్‌లు ఆడి 21.51 సగటుతో 39 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో11 మ్యాచుల్లో 15 వికెట్లను తీశాడు.
ఇది రెండో సీజన్..
యర్రా పృథ్వీరాజ్‌ది గుంటూరు జిల్లా దుగ్గిరాల. రంజీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీ.. గత ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున ఆడాడు. ఆ జట్టు రూ.20 లక్షల బేస్ ప్రైస్‌కి పృథ్వీని కొనుగోలు చేసింది. కానీ.. ఆ సీజన్‌లో రెండు మ్యాచులాడి కేవలం ఒకే ఒక్క వికెట్ తీయడంతో అతడిని కేకేఆర్ వదులుకుంది. గత సీజన్‌లో పృథ్వీ సన్‌రైజర్స్ జట్టుపైనా ఓ మ్యాచ్ ఆడి కెప్టెన్ డేవిడ్ వార్నర్ వికెట్‌ను పడగొట్టడం విశేషం.
సీజన్ స్టార్టింగ్ నుంచి సన్‌రైజర్స్‌తోనే…
లోకల్ ప్లేయర్స్‌పై ఫోకస్ పెట్టిన హైదరాబాద్ జట్టు యాజమాన్యం ఈ సీజన్ ప్రారంభం నుంచి వృథ్వీరాజ్‌ను నెట్ బౌలర్‌గా వినియోగించుకుంటోంది. కరోనా బయో బబుల్ తదితర నిబంధనలన్నీ పాటించి సన్‌రైజర్స్‌తో కలిసే వృథ్వీరాజ్ ప్రయాణిస్తున్నాడు. నెట్స్‌లో పృథ్వీ తన ప్రతిభతో సన్‌రైజర్స్ మెంటార్ లక్ష్మణ్‌ను మెప్పించినట్టు తెలిసింది. ఈక్రమంలో గాయపడి అనూహ్యంగా టోర్నీ నుంచి భువనేశ్వర్ వైదొలగడంతో పృథ్వీకి అవకాశం ఇచ్చింది సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్.
సన్‌రైజర్స్‌కు గాయాల బెడద..
ఈ సీజన్‌లో నస్‌రైజర్స్ జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. ఒకే ఒక్క మ్యాచ్ అడిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో వెస్టిండీస్‌కు చెందిన జాసన్ హోల్డర్‌ను హైదరాబాద్ జట్టు ఎంపిక చేసుకోగా ఇప్పుడు కీలక ఆటగాడు భువనేశ్వర్ కూడా గాయపడి తప్పుకున్నాడు. దీంతో పృథ్వీరాజ్‌కు చోటు దక్కింది.










