కంగనా రనౌత్.. ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కడ విన్నా ఈమె పేరే వినబడుతోంది. సుశాంత్ ఆత్మహత్య విషయంలో తాను స్పందించిన తీరుతో ఆమె అందరి ద్రుష్టి ఆకర్షించింది. ఆతర్వాత బాలీవుడ్ లో జరుగుతున్న డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఆమె అనేకమందిని బహిరంగంగానే విమర్శించింది. అంతే కాకుండా ఒక అడుగు ముందుకు వేసి నటి ఉర్మిళను ఒక పోర్న్ స్టార్ తో పోల్చి సంచలనం సృష్టించింది. బాలీవుడ్ ని మాత్రమే కాదు కంగనా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వదిలిపెట్టలేదు. మహారాష్ట్ర సీఎం కుమారుడు ఆదిత్య ఠాక్రే సుశాంత్ మరణానికి కారణమని ఆమె బాంబు పేల్చింది. ఆమెకు ఎన్ని బెదిరింపులు వస్తున్నా ఎక్కడా తగ్గటం లేదు. తాజాగా శివసేన కార్యకర్తలు ఆమెను మహారాష్ట్రలో అడుగు పెట్టనివ్వమని వారు తెలిపారు. కంగనా మాత్రం కేంద్రం అందించిన బందోబస్తుతో మహారాష్ట్రలో అడుగు పెట్టి, తాను ఎవరికీ భయపడనని మరోసారి రుజువు చేసింది.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న కంగనా తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనలు చేస్తున్నారు. విపక్షాలతో పాటు రైతులు కూడా కలిసి వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్వహించారు. ఆ సందర్బంగా రైతులు చేపట్టిన ఉద్యమాలకు వివిధ పార్టీలతో పాటు సినిమా పరిశ్రమకు చెందిన వారు సైతం చాలా మంది రైతులకు మద్దతుగా నిలిచి వ్యవసాయ బిల్లుపై విమర్శలు చేశారు. ఈ విషయంపై కంగనా ట్విట్ చేస్తూ రైతుల రూపంలో కొందరు కావాలనే ఈ గొడవలు సృష్టిస్తున్నారు.. అనే అర్ధం వచ్చేలా ఆమె ట్విట్ చేసింది. ఈ ట్విట్ పై విపక్షాలు మండిపడుతున్నాయి. రైతులపై కంగనా స్పందించిన తీరు వారిని అవమాన పర్చే విధంగా ఉందంటూ విమర్శలు గుప్పించారు. రైతులను కంగనా ఉగ్రవాదులతో పోల్చుతూ ట్వీట్ చేసింది అంటూ ఆమెపై విపక్షాల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకకు చెందిన ఎల్. రమేష్ నాయక్ అనే హైకోర్టు న్యాయవాది రైతుల ఆందోళనపై కంగనా చేసిన వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించాడు. కంగనా వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.











