వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా ఏ పార్టీలో ఉన్నా ఫైర్ బ్రాండ్ ముద్ర మాత్రం కొనసాగుతూనే ఉంటోంది. ఎవరిపైనైనా మాటలతో విరుచుకుపడటం ఆమె నైజం. టీడీపీలో రెండు సార్లు టిక్కెట్టు దక్కినా విజయం వరించలేదు. 2004లో నగరిలో చెంగారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక 2009లో చంద్రగిరిలో గల్లా అరుణకుమారి చేతిలో ఓటమిపాలయ్యారు. టీడీపీలో రోజాకు కలసి రాలేదనే చెప్పాలి.
రోజా వైసీపీలో చేరి నగరి నుంచి రెండు సార్లు విజయబావుటా ఎగురవేశారు. అప్పటి నుంచీ రాజకీయాల్లో రోజా వెనుతిరిగి చూడలేదు. వైసీపీ అధికారంలోకి వస్తే రోజాకు క్యాబినెట్ మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. కానీ చిత్తూరు సీనియర్ నేతలు రోజా సామాజికవర్గంవారు ఉండటంతో ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. రోజాను సంతృప్తి పరచేందుకు వైసీపీ అధిష్ఠానం ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి కట్టబెట్టింది. టీడీపీ నాయకులపై ఒంటి కాలిపై లేచే రోజాకు ప్రస్తుతం సొంత పార్టీ నేతల నుంచి సెగ తప్పడం లేదు.
డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీరుపై రోజా ప్రతాపం
ఇటీవల డిప్యూటీ సీఎం నారాయణస్వామి నగరి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే రోజాకు మాత్రం ఆ విషయం చెప్పలేదట. దీంతో రోజా అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఎవరైనా తన నియోజకవర్గంలో తిరగాలంటే తనకు తెలియజేయాలని కుండబద్దలు కొట్టారు. నేను డిప్యూటీ సీఎంని నేను ఎక్కడైనా తిరుతానని నారాయణస్వామి బదులిచ్చారు. ఇదే మాట సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద చెప్పే దమ్ముందా అని రోజా సవాల్ విసిరారు. దీనికి నారాయణస్వామి నుంచి జవాబు రాలేదు. రోజా దెబ్బకు ఎవరైనా మూసుకోవాల్సిందేనని వైసీపీ వర్గాలు చెవులు కొరుకుంటున్నాయట.
పెద్దిరెడ్డితోనూ విభేదాలు…
రోజాకు మంత్రి పెద్దిరెడ్డితోనూ విభేదాలు వెలుగు చూశాయి. నగరి మున్సిపాలిటీలో వైసీపీ కీలక నేతగా ఉన్న కే.జే.కుమార్ కు ఈడిగ కార్పొరేషన్ పదవి దక్కింది. పదవి ప్రకటించే వరకూ రోజాకు కూడా తెలియదట. దీంతో కె.జె. కుమార్ కు మంత్రి పెద్దిరెడ్డే పదవి వచ్చేలా చేశారని రోజా మరోసారి ఫైర్ అయ్యారు.
తన నియోజకవర్గంలో తనపై తిరుగుబాటు జెండా ఎగరేస్తున్న నేతలను పెద్దిరెడ్డి ప్రోత్సహిస్తున్నాడంటూ రోజా విమర్శలు గుప్పించారు. అయినా పెద్దిరెడ్డితో పెట్టుకోవద్దని గతంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి, రోజాకు సలహా ఇచ్చారని తెలుస్తోంది. అయినా ఫైర్ బ్రాండ్ కదా ఆ మాత్రం ఫైర్ చూపించకపోతే ఎలా?
రోజాకు మంత్రి ఛాన్స్ దక్కుతుందా?
వైసీపీ ప్రభుత్వం ప్రమాణస్వీకారం తరవాత సీఎం జగన్మోహన్ రెడ్డి బాంబు పేల్చారు. మంత్రుల్లో చాలా మందిని రెండున్నర సంవత్సరాల తరవాత మారుస్తానని ప్రకటించారు. మంత్రి పదవులు రానివారు నిరుత్సాహ పడాల్సిన పనిలేదని చెప్పారు. దీంతో మంత్రి పదవులు రాని వారు రెండున్నర సంవత్సరాలు ఎప్పుడు పూర్తవుతాయా అని రోజులు లెక్కపెడుతున్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులందరినీ మార్చే సాహసం చేయకపోవచ్చు. సీనియర్ మంత్రులను కొనసాగించే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఇక రోజాకు మంత్రి పదవి దక్కకపోవచ్చని తెలుస్తోంది. అందుకే రోజాకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి ఇచ్చారని కూడా ప్రచారం జరుగుతోంది.











