ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ పరిస్థితి అంతకంతకూ తీసికట్టుగా మారుతోందన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. అధికార పార్టీనో, ఇంకేదో పార్టీనో చేస్తున్న ఆరోపణలు కాకుండా స్వయంగా టీడీపీ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే… ఈ తరహా వాదనలు రేకెత్తుతున్నాయి. సోమవారం ఉదయం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్బంగా సభలో ప్రతిపక్ష నేత హోదాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యవహరించిన తీరు, అధికార పక్షంపై ఆయన విరుచుకుపడిన తీరు… అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహార సరళి చూస్తుంటే.. నిజంగానే టీడీపీ పరిస్థితి అంతకంతకూ తీసికట్టుగానే మారిపోతోందన్న భావన కనిపించక మానదు.
నిమ్మకు నీరెత్తినట్లుగా..
గడచిన ఎన్నికల్లో టీడీపీకి 23 అసెంబ్లీ సీట్లు రాగా… ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించినా… ఇంకా 20 మంది ఎమ్మెల్యేలు పార్టీలో ఉన్నారు. ఈ క్రమంలో విపక్ష నేత హోదాలో చంద్రబాబు అధికార పక్షంపై విరుచుకుపడితే… 20 మంది ఎమ్మెల్యేలు కూడా బాబుకు అండగా నిలవాలి. విపక్ష నేత కంటే కూడా ముందుగానే పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగాలి. వెరసి చంద్రబాబుకు పెద్దగా పని లేకుండానే అధికార పక్షాన్ని నిలువరించాలి. అయితే సోమవారం నాటి సభలో ఆ తరహా స్పందన టీడీపీ ఎమ్మెల్యేల్లో లోపించిందనే చెప్పాలి. అధికార పార్టీ ఒంటెత్తు పోకడలపై చంద్రబాబు తనదైన శైలిలో విరుచుకుపడితే.. విపక్ష పార్టీ సభ్యులుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిన తీరు స్పష్టంగానే కనిపించింది.
13 మందే హాజరు
పార్టీ తరఫున 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నా… శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున సభకు కేవలం 13 మంది మాత్రమే హాజరైన తీరు కూడా టీడీపీ ఎమ్మెల్యేల ఉదాసీన వైఖరికి అద్దం పడుతోందని చెప్పాలి. సమావేశాల ప్రారంభం రోజునే ఏకంగా ఏడుగురు ఎమ్మెల్యేలు సభకు డుమ్మా కొట్టడమో, లేదంటే అసెంబ్లీకి వచ్చినా… సభలో లేకుండా పోవడమంటే… టీడీపీ ఎమ్మెల్యేల్లో సీరియస్ నెస్ లేదన్న విషయాన్ని వెల్లడిస్తోంది. అంతేకాకుండా అధికార పక్షం విపక్షం గొంతు నొక్కడంపై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు… విపక్ష నేత హోదాలో ఉన్నానని తెలిసినా… పొడియం ముందు కింద నేలపై కూర్చుంటే.. ఆయన వెంట వచ్చిన చాలా మంది ఎమ్మెల్యేలు అసలు కింద కూర్చునేందుకే సిద్ధపడలేదు. ఈ తరహా అంశాలన్నింటినీ జాగ్రత్తగా గమనించిన అధికార పక్షం చంద్రబాబుపై మరింత గట్టిగా ఆరోపణలు గుప్పించింది. చంద్రబాబు మాటను ఆయన పార్టీ సభ్యులే వినడం లేదంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే… టీడీపీ ఎమ్మెల్యేల తీరు తక్షణమే మారాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న మాట వినిపిస్తోంది.











