టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపైనా, ఆయన వ్యవహార సరళిపైనా, ఆయనలోని సహనంపైనా అదే పార్టీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ తీరు చూసైనా చంద్రబాబు తన తీరును మార్చుకోవాలంటూ సునీత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. చంద్రబాబులోని సహనం కారణంగానే తామంతా సైలెంట్ గా ఉంటున్నామని, చంద్రబాబు ఆ సహనాన్ని వీడితే వైసీపీకి తామేంటో చూపిస్తామంటూ శుక్రవారం నాడు సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు చేసిన సూచనలను సైతం ప్రస్తావించిన సునీత ఈ వ్యాఖ్యలు చేయడం టీడీపీ శ్రేణుల్లోని ఆగ్రహావేశాలకు నిదర్శనమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సునీత ఏమన్నారంటే..?
టీడీపీ కేంద్ర కార్యాలయం సహా జిల్లాల్లోని ఆ పార్టీ కార్యాలయాలపై మంగళవారం నాడు వైసీపీ శ్రేణులు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు నిరసనగా చంద్రబాబు 36 గంటల పాటు నిరసన దీక్షను చేపట్టారు. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరిట మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ దీక్ష ఇప్పటికే 24 గంటలను పూర్తి చేసుకోగా.. శుక్రవారం రాత్రి 8 గంటలకు చంద్రబాబు దీక్షను విరమించనున్నారు. ఓ వైపు చంద్రబాబు దీక్ష చేస్తుంటే.. మరోవైపు పార్టీ శ్రేణులు వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమన్నారంటే.. ‘‘సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు గంట పాటు కళ్లు మూసుకుంటే చాలు.. తామెంటే వైసీపీకి చూపిస్తాం. ప్రత్యర్థులు దాడులకు తెగబడుతున్నా.. సహనంతో ఉండటం సరికాదు. చంద్రబాబు తీరు ఇప్పటికైనా మారాలి. నా భర్తను చంపినప్పుడు కూడా ఓర్పుతో ఉండాలని చంద్రబాబు చెప్పిన మాట మేరకే సహనంతో ఉన్నాం. టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఎం కుర్చీలో కూర్చున్నాక చంద్రబాబు ఓ గంట పాటు కళ్లు మూసుకుంటే టీడీపీ సత్తా ఏమిటో వైసీపీకి చూపిస్తాం. వైసీపీ నేతలు, శ్రేణులకు చుక్కలు చూపుతాం. మాలో కూడా రాయలసీమ రక్తమే ప్రవహిస్తోంది’’అంటూ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.
జనాగ్రహ దీక్షలపై ఆగ్రహం
చంద్రబాబు చేపట్టిన ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు దీక్షకు పోటీగా వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన జనాగ్రహ దీక్షలపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఈ దీక్షల ఉద్దేశ్యం ఏమిటని కూడా టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. దాడులకు తెగబడ్డవారే దీక్షలు చేయడమేమిటని కూడా నిలదీస్తున్నాయి. ఈ దీక్షల ద్వారా మరిన్ని దాడులకు దిగాలని ప్రజలకు సూచిస్తున్నారా? అన్న కోణంలోనూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు దీక్షకు జనం నుంచి ఆమోదం రాకుండా చూడాలన్న లక్ష్యంతోనే వైసీపీ జనాగ్రహ దీక్షలకు తెర తీసిందని కూడా టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.