పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడు పెరిగిందండోయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు ‘వకీల్ సాబ్’ షూటింగ్ లో పాల్గొన్నారు. పవర్ స్టార్ అభిమానులు పండగ చేసుకునే వార్త ఇది. ఆయన ఈ సినిమా పూర్తయ్యేవరకూ షూటింగ్ కొనసాగిస్తారు.
‘వకీల్ సాబ్’ లో కోర్టు బయట జరిగే కొన్ని సన్నివేశాలను ఈరోజు చిత్రీకరిస్తున్నారు. పెద్ద ఎత్తున మీడియా వాహనాలను కూడా దించేశారు. అంటే ఈ సన్నివేశాల్లో మీడియా కూడా కనిపిస్తుందన్న మాట. దీని కోసం హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని ఓ భవంతిని కోర్టుగా ఎంచుకున్నారు. ఆ భవంతి ఆవరణలో ఈరోజు షూటింగ్ జరుగుతోంది. మరో వారం పది రోజులు ఏకధాటిగా షూటింగ్ చేస్తే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయి పోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 90 శాతం షూటింగ్ పూర్తయింది. ఇంకో పది శాతం షూటింగ్ జరిగితే చాలు.
ఈ దీపావళికి కూడా ఈ సినిమాకి సంబంధించిన సర్ ప్రైజ్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. త్వరలోనే దీని టీజర్ విడుదల చేయటానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి అసలైన పందెంకోడి ‘వకీల్ సాబ్’ కావడానికే అవకాశం ఎక్కువ ఉంది. పవన్ కళ్యాణ్ కు ఇది 26వ సినిమా. ఇందులో నివేదా థామస్, లావణ్యా త్రిపాఠి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హిందీలో విజయవంతమైన ‘పింక్’ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హిందీ లో అమితాబ్ పోషించిన పాత్రను పవన్ పోషిస్తున్నారు. పవన్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ పాత్ర నిడివిని కూడా బాగా పెంచినట్లు సమాచరం.
వేణుశ్రీరామ్ దర్శకత్వంలో బోనీకపూర్, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా దాదాపు ఆరు నెలలుగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలను అక్టోబరు నుంచే చిత్రీకరించడం ప్రారంభించారు. ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో ఈరోజు నుంచి ఆయనకు సంబంధించిన షెడ్యూల్ ప్రారంభించారు. మరో విశేషమేమిటంటే ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ హక్కులను సన్ నెట్ వర్క్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అంటే జెమినీ టీవీలో ‘వకీల్ సాబ్’ ప్రసారమవుతుంది. డిజిటల్ రైట్స్ విషయం ఇంకా తేలినట్లు లేదు.