ట్రిపుల్ ఆర్ సినిమాకి పవన్ కళ్యాణ్ పక్కలో బల్లెం లానే తయారైనట్టుంది. సంక్రాంతి బరిలోకి దిగబోతున్న పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ ను ట్రిపుల్ ఆర్ బృందం అడ్డుకుంది. మొదట్లో తగ్గేదే లే అని పవన్ భీష్ముంచుకు కూర్చున్నా పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ కావడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ ఇక్కడ నెగ్గుతుందనుకున్నా ట్రిపుల్ ఆర్ కూడా వెనక్కి తగ్గిపోయింది. దానికి కారణం కరోనా థర్డ్ వేవ్. ట్రిపుల్ ఆర్ ను ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
భీమ్లానాయక్ ఫిబ్రవరి 25న విడుదల కానుంది. కానీ ట్రిపుల్ఆర్ మాత్రం ఏప్రిల్ 28 లేదా 29 తేదీల్లో విడుదలకు సిద్ధమవుతోంది. వేసవి సీజన్ అయితే మంచి వసూళ్లు సాధించవచ్చన్నది వీరి అంచనా. అందుకే ఆ తేదీలను లాక్ చేశారు. భీమ్లానాయక్ ముందే వచ్చేస్తోంది కదా ఇంక చిక్కేముంది అనుకుంటున్నారా? ఉంది మంది అక్కడే వస్తున్నాం. పవన్ ‘హరిహర వీరమల్లు’ కూడా లైన్లోనే ఉంది. ఈ సినిమా వాస్తవానికి హరిహర వీరమల్లును జనవరి 29న విడుదల చేయాల్సి ఉంది. కానీ చిత్రీకరణ పూర్తికాలేదు.
దాంతో దర్శకుడు క్రిష్ ఏప్రిల్ 29 అయితే భేషుగ్గా ఉంటుంది అనడంతో ఆ తేదీని వీరు లాక్ చేసినట్టు సమాచారం. దాంతో మళ్లీ తలనొప్పి మొదలు. మరి ఈసారి ఎవరు వెనక్కి తగ్గాలో? పవన్ మరోసారి త్యాగానికి సిద్ధంగా ఉండాలన్నది స్పష్టమవుతోంది. పెద్ద సినిమాలన్నీ విడుదల వాయిదా వేసుకోవడం వల్ల ఇలా క్లాష్ అవుతున్నాయి. అప్పటికి కరోనా థర్డ్ వేవ్ తగ్గుతుందన్న నమ్మకం లేకపోయినా ఆ తేదీలను మాత్రం మేకర్స్ లాక్ చేసుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.











