(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవకాశం లేకపోయినా ఇప్పటికీ క్విడ్ ప్రో కో విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కొనసాగిస్తున్నాడని మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోపించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను వందశాతం ప్రైవేటీకరణ చేసి తీరుతామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడాన్ని ఆయన ఖండించారు. ప్రైవేటీకరణ అంశం బయటకు వచ్చిన రోజే తాను చెప్పానని, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఎంపీ విజయసాయి రెడ్డి రోడ్డెక్కి రంకెలు వేశారని, ఇంకెంతకాలం ప్రజలను మభ్య పడతారని సబ్బం హరి ప్రశ్నించారు. పచ్చి అబద్దాలు చెప్పడం, ప్రజలను మోసం చేయడం వారికి అలవాటని అన్నారు. కేంద్రం… రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, పోస్కో ప్రతినిధులను ఇక్కడకు పంపి ఎంఓయూ కుదుర్చుకున్నారు. అంతకు ముందే ముఖ్యమంత్రి జగన్ “ ఇది కుదరదు” అని స్పష్టం చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు.
ప్రైవేటీకరించడం తగదని చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా..
కొత్తగా విడిపోయిన రాష్ట్రం, ఆర్థిక లోటుతో ఉందని, కొత్తగా పరిశ్రమలు కూడా రావడం లేదని, రాజధాని నిర్మాణం కూడా పూర్తి కాలేదని, పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి… ఈ దశలో ఉన్న పరిశ్రమలు ప్రైవేటీకరించడం తగదని చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీని వ్యతిరేకించ లేక, కేసులు నుంచి గట్టెక్కించే బాధ్యత మీదే… మీరు ఏం చెప్పినా సరే.. అని మోకరిల్లిన ముఖ్యమంత్రి, నాకెంత నీకు ఎంత అని మాట్లాడుకుని ఈ చర్యకు ఒడిగట్టారని ఆరోపించారు.
పరిశ్రమ విస్తరణ కోసం, ప్రమాదాల సమయంలో ప్రజలకు ప్రాణ హాని లేకుండా ఉండేందుకు కోసం సేకరించిన స్టీల్ ప్లాంట్ భూములను విక్రయించి లేఅవుట్లు గా మారుస్తామని బుద్ధి, అవగాహన ఉన్న వ్యక్తి ఎవరైనా సలహా ఇస్తారా అని హరి ప్రశ్నించారు. పరిపాలనా లేమి అవగాహనా రాహిత్యం ఈ ముఖ్యమంత్రిలో నిలువెల్లా ఉందని అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు A1,A2లు ఏం చెబుతారు? ఎంపీలతో రాజీనామా చేయించగలరా? అని ప్రశ్నించారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాల్సిన అవసరం లేదని అన్నారు. కేంద్రం ప్రైవేటు యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్నా, వాళ్లు విశాఖలో స్టీల్ ప్లాంట్ నిర్వహించాలంటే రాష్ట్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరని స్పష్టం చేశారు. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలో ఉన్నందున రాష్ట్ర సహకారం లేనిదే కేంద్రం ఏం చేయలేదని అన్నారు. ప్రభుత్వ సహకారం కేంద్రానికి లేకపోతే పోస్కోను విశాఖ వాసులు తరిమి కొడతారని అన్నారు.
Must Read ;- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తప్పదన్న నిర్మలా సీతారామన్.. రగిలిపోయిన కార్మిక సంఘాలు