ఆర్థిక నేరాలు మన దేశంలో కొత్తేమీ కాదు. అయితే ఆర్థిక నేరగాళ్లు వివిధ కాలాల్లో, వివిధ రూపాల్లో ప్రజలను దోచుకుంటూ ఉంటారు. జనం నిండా మునిగాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ప్రారంభిస్తూ ఉంటాయి. మూడు దశాబ్దాల్లో ఇలాంటి ఆర్థిక నేరాల ద్వారా ప్రజలు అక్షరాలా మూడు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారని కేంద్ర నేర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా మరో కుంభకోణం చాప కింద నీరులా ప్రజలను పీల్చి పిప్పి చేస్తోంది. అదే పెరల్ వైన్. ఎక్కడా కనీసం ఒక్క కార్యాలయం కూడా లేకపోయినా ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ సంస్థ గొలుసుకట్టు విధానంలో రూ.25 వేల కోట్ల రూపాయలు వసూలు చేసిందని ఓ అంచనా. ఒక్క ఏపీలోనే ఈ సంస్థ రూ.1200 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది. అసలు ఏమిటి పెరల్ వైన్. ఏమిటీ గొలుసుకట్టు దోపిడీ.
పెరల్ వైన్ గొలుసుకట్టు దోపిడీ
పెరల్ వైన్ సంస్థ ఎలాంటి వస్తువులు అమ్మాలని ఏజంట్లకు చెప్పదు. కేవలం రూ.2250 ఆన్ లైన్ ద్వారా చెల్లిస్తే చాలు. అతను ఈ సంస్థ ఏజంటుగా మారినట్టే. ఇక ఆ వ్యక్తి మరో ఐదుగురితో రూ.2250 చొప్పున సంస్థకు చెల్లించే విధంగా వారిని ప్రోత్సహించాలి. మొదటగా చేరిన వ్యక్తి ఐదుగురిని జాయిన్ చేయిస్తే అతనికి రూ.7250 ఆన్ లైన్‌లో చెల్లిస్తుంది. ఇక అంతే మొదటి వ్యక్తి చేయాల్సిన పని అయిపోయింది. ఇక ఆ ఐదుగురు ఒక్కొక్కరు ఐదుగురి చొప్పున 25 మందిని జాయిన్ చేయించాలి. ఇదే పెరల్ వైన్ వ్యాపారం.
గొలుసుకట్టు మార్కెటింగ్‌ను దశాబ్దం కిందటే నిషేధించినా పెరల్ వైన్ మాత్రం తన వ్యాపారాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎలాంటి వస్తువులు గొలుసుకట్టు ద్వారా అమ్మడం లేదు అనేది పెరల్ వైన్ వాదన. చట్టాల్లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని పెరల్ వైన్ సంస్థ దేశ వ్యాప్తంగా కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నా ఈడీ, ఆర్బీఐ, పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారని తెలుస్తోంది.
త్వరలోనే బుడగ పేలుతుంది
గొలుసుకట్టు వ్యాపారాలు ఎంతో కాలం సాగవు. ఏదో ఒక పాయింట్ వద్ద నిలిచిపోతాయి. మొదట్లో చేరిన వారు కొంత లాభపడితే లాభపడవచ్చు. కానీ దేశంలో లక్షలాది మంది కష్టార్జితం మాత్రం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిపోతుంది. వారి వద్ద నుంచి రికవరీ చేసే అవకాశాలు కూడా మన దేశంలో లేవు. ఎక్కడో విదేశాల నుంచి అక్రమార్కులు పెరల్ వైన్ సైట్ ను ఆపరేట్ చేస్తున్నారు. దీంతో ఆర్థిక నేరస్థులను పట్టుకోవడం కూడా సాధ్యం అయ్యే పనికాదు.
చేతులు కాలాక..
దేశంలో అనేక ఇంటెలిజెన్స్ సంస్థలు పనిచేస్తున్నాయి. వారంతా ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. పెరల్ వైన్ సంస్థకు అసలు అనుమతులు ఉన్నాయా? ఉంటే ఆ సంస్థ నిర్వహించే వ్యాపారం ఏమిటి? బిచానా ఎత్తి వేస్తే కోట్లాది రూపాయలు చెల్లించిన ప్రజల భవిష్యత్ ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తక మానవు. ఇలాంటి గొలుసుకట్టు సంస్థను, ప్రారంభంలోనే కట్టడి చేయాల్సిన వ్యవస్థలు మొద్దు నిద్ర నటించడం ఎంత నష్టం చేస్తుందో.. ఆయా సంస్థలు బోర్డు తిప్పివేశాక తెలసి వస్తుంది. ఆర్థిక నేరగాళ్లపై ఆదిలోనే ఉక్కుపాదం మోపకపోతే దేశ ఆర్థిక వ్యవస్థకే పెనుసవాల్ విసిరే ప్రమాదం పొంచి ఉంది.











