ప్రశాంత్ కిశోర్.. మనమంతా పొట్టిగా పీకే అని పిలుచుకునే రాజకీయ వ్యూహకర్త పేరు తెలియని భారతీయులు ఉండరేమో. భారతీయులేంటి.. ప్రపంచ దేశాల రాజకీయ ధోరణులను పరిశీలించే వారికి కూడా పీకే చిరపరచితుడి కిందే లెక్క. 2014 సార్వత్రిక ఎన్నికల కంటే ముందు నుంచే రాజకీయ వ్యూహరచనలో అడుగుపెట్టిన పీకే.. 2014లో మోదీ నేతృత్వంలోని బీజేపీకి ఘన విజయం దక్కిన తర్వాత ఒక్కసారిగా ఒక్కసారిగా ప్రముఖుడిగా మారిపోయారు. అప్పటి నుంచి పీకే గురించిన ఏ చిన్న విషయం అయినా దాదాపుగా అన్ని పత్రికల్లో పతాక శీర్షికలకే ఎక్కుతోంది. 2014లో మోదీని, 2019లో ఏపీలో జగన్ ను, 2021లో అటు బెంగాల్ లో మమతా బెనర్జీని, ఇటు తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ లను అధికార పీఠమెక్కించిన వ్యూహకర్తగా పీకేకు మంచి పేరే ఉంది. బీహార్ కు చెందిన పీకే.. రాజకీయ వ్యూహాల్లో దిట్టగానే తేలినా.. అదే రాజకీయాల్లోకి నేరుగా ప్రవేశించి డైరెక్ట్ ఫైట్ కు దిగమంటే మాత్రం బెంబేలెత్తిపోతున్న వైనం చాలా స్పష్టంగానే కనిపిస్తోంది.
నితీశ్ పార్టీతో చేదు అనుభవం
రాజకీయ వ్యూహకర్తగా ఓ రేంజి ప్రమోషన్ దక్కించుకున్న పీకే..అప్పుడెప్పుడో తన సొంత రాష్ట్రం బీహార్ లో రాజీకీయాల్లోకి ప్రత్యక్షంగానే ఎంట్రీ ఇచ్చారు. బీహార్ అధికార పార్టీ జేడీయూలో చేరిన ఆయనకు ఆ పార్టీ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఏకంగా జేడీయూ ఉపాధ్యక్ష పదవి కూడా కట్టబెట్టారు. పీకే కోరాలే గానీ.. జేడీయూకు తన తర్వాత వారసుడు పీకేనే అని కూడా ప్రకటించేందుకు నితీశ్ వెనుకాడని పరిస్థితి. అయితే రాజకీయ వ్యూహాల రచన మాదిరి రాజకీయాల్లో రాణించడమంటే అంత ఈజీ కాదన్న విషయం పీకేకు చాలా త్వరగానే తెలిసిపోయింది. ఇంకేముంది.. తనను పిలిచి అందలం ఎక్కించిన నితీశ్ విధానాలను తులనాడుతూ జేడీయూ నుంచి పీకే బయటకు వచ్చేశారు. అప్పటి నుంచి అటు మోదీ అన్నా, ఇటు మోదీకి మద్దతు పలికేవారన్న పీకేకు అస్సలు పడటం లేదు. అసలు మోదీకి మద్దతు పలికిన కారణంగానే నితీశ్ ను పీకే వ్యతిరేకించారని చెప్పాలి. మొత్తంగా ప్రత్యక్ష రాజకీయాలు తనకు సరిపడవన్న ఓ భావనకు వచ్చిన పీకే.. జేడీయూ నుంచి బయటకు వచ్చేసి మళ్లీ తనకు అలవాటైన వ్యూహ రచనలోనే నిమగ్నమైపోయారు.
హస్తం పార్టీలో చేరతారా?
అదేంటో గానీ.. ఒక్కసారిగా రాజకీయాల రుచి చూస్తే వాటికి దూరంగా జరగడం అంత ఈజీ కాదన్న మాట కూడా పీకే విషయంలో నిజమైందన్న వాదనలు వినిపిస్తుననాయి. నితీశ్ తో పడక జేడీయూ నుంచి.. రాజకీయాల నుంచి బయటకు వచ్చేసిన పీకే.. మళ్లీ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగే దిశగా కదులుతున్నారు. ఓ రెండు నెలల క్రితం రాజకీయ వ్యూహ రచనకు వీడ్కోలు పలుకుతున్నానని చెప్పిన ప్రశాంత్.. వరుసపెట్టి రాజకీయ ప్రముఖులను కలుస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో పలుమార్లు భేటీలు వేసిన పీకే.. ఈ మధ్య కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతోనూ వరుస భేటీలు వేస్తున్నారు. అంతేకాకుండా 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా విపక్షాలన్నింటినీ ఏకం చేసే బాధ్యతను కూడా పీకే తన భుజస్కందాలపై వేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఏకంగా కాంగ్రెస్ పార్టీలో చేరి మోదీతో పోటీకి కూడా సై అన్న రీతిలో సాగాలని కూడా ఆయన తలపోస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రాహుల్ గాంధీతో పాటు సోనియా, ప్రియాంకలు కూడా పీకేను తమ పార్టీలో చేరాలంటూ ఆహ్వానించారని, వారి కంటే ముందుగా తానే కాంగ్రెస్ పార్టీలో చేరతానన్నట్లుగా పీకే సంకేతాలు ఇస్తున్నారన్న వాదనలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే దిశగా కదులుతున్న పీకే.. ఈ సారైనా వ్యూహ రచన మాదిరే డైరెక్ట్ ఫైట్ లోనూ విజయం సాధిస్తారో, లేదంటే జేడీయూ అనుభవంతోనే నిరాశగా వెనుదిరుగుతారో చూడాలి.