అప్పుడెప్పుడో ఉత్తరాది రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి.. సర్వీసులో పీక్ స్టేజ్ లో ఉండగానే శ్రీకృష్ణ పరమాత్మపై మనసు పడి, గోపిక వేషధారణలో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇప్పుడు అదే ఐపీఎస్ కేడర్ లో ఓ మాదిరి స్థాయిలో ఉన్న పోలీసు అధికారిణి కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధపడిపోయారు. ఏకంగా తన ఐపీఎస్ సర్వీసుకు రాజీనామా ఇచ్చేసి శ్రీకృష్ణ పరమాత్ముడి సేవలో శేష జీవితాన్ని తరిస్తానని ఆమె చెబుతున్నారు. అమితాసక్తి రేకెత్తిస్తున్న ఈ ఘటన కూడా ఉత్తర భారతానికి చెందినదే. దేశ రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న హర్యానా కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారిణి, ప్రస్తుతం అంబాలా రేంజ్‌లో ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్న భారతి అరోరా ఈ నిర్ణయం తీసుకుని అందరికీ షాకిచ్చారు. ఐపీఎస్ గా 23 ఏళ్ల పాటు పోలీసు అధికారిణిగా విధులు నిర్వహించానని, ఇకపై తన శేష జీవితాన్ని శ్రీకృష్ణుడి సేవకు అంకితం ఇవ్వదలచుకున్నానని ఆమె సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఆమె హర్యానా ప్రభుత్వానికి తన స్వచ్చంద పదవీ విమరణ లేఖను పంపారు.
ఆ లేఖలో భారతి ఏమంటారంటే..
“50 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత, ఆల్ ఇండియా సర్వీసెస్ (డీసీఆర్‌బీ) నిబంధనలు, 1958 లోని రూల్ 16 (2) ప్రకారం, ఆగస్టు 1, 2021 నుంచి సర్వీసు నుంచి పదవీ విరమణ కోరుతూ.. నేను ఈ దరఖాస్తును స్వచ్ఛందంగా సమర్పించాను. ఇప్పుడు నేను జీవితం అంతిమ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాను. పవిత్ర సాధువులైన గురు నానక్ దేవ్, చైతన్య మహాప్రభు, కబీర్దాస్, తులసీదాస్, సుర్దాస్, మీరాబాయి, సూఫీ సాధువులు చూపిన మార్గంలో జీవించాలనుకుంటున్నాను. శ్రీకృష్ణుడి సేవకు నా జీవితాంతం అంకితం చేయాలని నేను ఆరాటపడుతున్నాను’’ అని ఆమె తెలిపారు. ఇక దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఏమాత్రం ఆలస్యం చేయకుండానే.. ‘‘నా ఉద్యోగం అంటే నాకు ఎంతో గౌరవం, ఆసక్తి. ఇప్పటికే 23 ఏళ్లుగా విధులు నిర్వహించాను. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో పయణించాలనుకుంటున్నాను. అందుకే ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని భావిస్తున్నాను’’ అని కుండబద్దలు కొట్టేశారు.
భారతి కెరీర్ గ్రాఫ్ ఇలా..
ఐపీఎస్ అధికారిగా పని చేసిన భారతి అరోరా 2007 సంజౌతా ఎక్స్‌ప్రెస్ రైలు పేలుడు కేసును దర్యాప్తు చేశారు. అప్పుడు ఆమె పోలీసు సూపరింటెండెంట్‌గా (రైల్వే) విధులు నిర్వహించారు. పోలీసు పరిపాలన పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను ఏప్రిల్ 2021 లో కర్నాల్ నుంచి అంబాలా రేంజ్‌కు బదిలీ చేశారు. మొత్తంగా భారతి సర్వీసులో మెరుపులేమీ లేవు. అలాగని మరకలు కూడా లేవనే చెప్పాలి. కష్టపడి సంపాదించుకున్న ఐపీఎస్ హోదాను అలా అలా లాగించేశారనే చెప్పాలి. తన సర్వీసుపై ఆమె ఏమంటారంటే.. “నా సేవ పట్ల నేను ఎంతో గర్విస్తున్నాను. నాకు సేవ చేయడానికి, నేర్చుకోవడానికి, ఎదగడానికి అవకాశం కల్పించినందుకు ఈ సేవకు నేను చాలా కృతజ్ఞతలు. నాకు సరైన మార్గాన్ని చూపించినందుకు హరియాణా రాష్ట్రానికి నా కృతజ్ఞతలు. నా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని ఆగస్టు 1 నుంచి స్వచ్ఛందంగా సేవ నుంచి విరమించుకునేందుకు నన్ను అనుమతించమని నేను కోరుతున్నాను”అంటూ ఏమాత్రం తణుకూ బెణుకూ లేకుండా ఆమె చెప్పుకొచ్చారు.
Must Read ;- మంత్రి మాట వినలేదు.. ఆ ఐపీఎస్ కు పోస్టింగే లేదు











