రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెంచింది. టీఆర్ఎస్ కు ధీటుగా సమాధానం చెబుతూ ప్రజల్లోకి వెళ్తోంది. దుబ్బాక ఎన్నికల తో జోష్ మరింత పెరిగింది. ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళ్తున్న బీజేపీ నేతలకుఒక్కసారిగా ఎందుకింత జోష్ వచ్చిందన్నది అందరిలోనూ అనమానం రేకెత్తిస్తోంది. ఇన్నాళ్ళూ వరుసగా ఇన్ని ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది లేదు. గత నెల రోజుల నుండే ఈ కార్యక్రమాలను ఉదృతం చేస్తూ పోలీసులకు నిద్రపట్టనివ్వకుండా చేస్తోంది.
ఇక దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్యం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. బీజేపీ ప్రతి అంశాన్ని ఎందుకింత సీరియస్ గా తీసుకుంటుంది.. పోలీసులు అరెస్ట్‌లు చేసినా వెనక్కి తగ్గకుండా రోజుకో కార్యక్రమంతో పోరుబాటు పడుతోంది.
సంజయ్ ఎందుకింత దూకుడుగా వెళ్తున్నారు..
బండి సంజయ్ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత బీజేపీ శ్రేణులు మరింత యాక్టివ్ అయ్యాయి. స్వతహాగానే ఆయనకు దూకుడు ఎక్కువ . జాతీయ నాయకత్వం సైతం ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో కార్యకర్తలు, పార్టీనేతలతో కలిసి టీఆర్ఎస్ పై దూకుడుగా పోరాడుతున్నారు. కార్యకర్తలను పోరాటాలకు ప్రోత్సహించడమే కాకుండా తాను కూడా స్వయంగా గ్రౌండ్ లోకి వెళ్ళి వారికి ధైర్యాన్నిస్తున్నారు. అయితే తన కార్యకర్తకు ఏదైనా జరిగితే మాత్రం వెంటనే అక్కడ వాలిపోయి .. ఎక్కడికైనా వెళ్ళేందుకు సిద్దపడతాడన్న పేరుంది. దీంతో ఆయన స్వయంగా అధ్యక్షుడిగా ఉన్న పార్టీ కార్యకర్తలకు ఆయన ఎంత అండగా ఉంటాడన్నది అర్థం చేసుకోవచ్చు.
ఇదే ఇప్పుడు సంజయ్ దూకుడుకు కారణంగా తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బీజేవైఎం అధ్వర్యంలో గతంలో ఆందోళనలకు పిలుపునిచ్చారు సంజయ్. దీంతో అన్ని కార్యాలయాల ముందు ఆదోళన చేపట్టారు కార్యకర్తలు. వరంగల్ లో ఏకంగా కలెక్టర్ కార్యాలయం మెట్లపై కూర్చుని తమ నిరసన వ్యక్తం చేసారు బీజేవైఎం కార్యకర్తలు. దీంతో రెచ్చిపోయిన పోలీసులు విచక్షణ రహితంగా లాఠీ చార్జీ చేసారు. ఈ లాఠీ చార్జ్ లో అనేక మంది కార్యకర్తలకు తీవ్రస్థాయిలో గాయాలయ్యాయి. అకరాణంగా తమ కార్యకర్తలపై ఎలా దాడులు చేస్తారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఆ తరువాతే సంజయ్ మరింత దూకుడు..
ఈ ఘటన జరిగిన తరువాత సంజయ్ టీఆర్ఎస్ పై దాదాపు యుద్దమే ప్రకటించారు. తమ కార్యకర్తలపై పోలీసులు దాడి చేసినా అధికార పార్టీ నుండి ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సంజయ్ టీఆర్ఎస్ పార్టీ పై ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలి పెట్టడం లేదు. ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్దమవుతున్నారు. ఇక తన వాగ్దాటితో కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూనే .. అంతర్గతంగా ఎక్కడా లీక్ కాకుండా ఆందోళన కార్యక్రమాలుచేపడుతున్నారు.
అసెంబ్లీ ముట్టడితో పోలీసులకు చెమటలు పట్టించారు.. గ్రేటర్ మునిసిపల్ కార్యాలయాల ముట్టడి ఇలా గ్యాప్ లేకుండా ఆందోళన చేపడుతోంది బీజేపీ.
ఇక దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా సంజయ్ దూకుడుకు కూడా ఇదే కారణంగా చెబుతున్నారు బీజేపీ నేతలు. కార్యకర్తలకు చీమ కుట్టినా ఊరుకునేది లేదని .. రాష్ట్ర ప్రభుత్వం రాక్షస పాలన చేస్తూ తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే రానున్న రోజుల్లో మరింత ఉధృత పోరాటానికి సిద్దమవ్వాలని సంజయ్ పిలుపునిచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సంజయ్ చేస్తున్న ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది.. పార్టీ శ్రేణుల పోరాటం చివరి వరకుకొనసాగిస్తారా అనేది వేచి చూడాలి.