హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. దీనికిగానూ ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగుతోంది. ఓటర్లుగా పేర్ల నమోదు చేసుకోవడానికి ఈ రోజు చివరి రోజు కావడంతో నేతలు బస్తీ బాట పట్టారు. ఓటర్లుగా మిగిలిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? లేదా? అని వార్డు వార్డుకు జల్లెడ పడుతున్నారు. ఎవరైనా ఉంటే తక్షణమే వారి దగ్గరి నుంచి కావాల్సిన సర్టిఫికేట్లను తీసుకుని దగ్గరుండి మరీ ఓటర్లుగా పేర్లను నమోదు చేస్తున్నారు. అధికారపార్టీ.. ఓటర్ల పేర్ల నమోదు విషయంలో కాస్త ముందే ఉందని చెప్పాలి. వార్డుల వారీగా స్థానిక నాయకులను బాధ్యతలను అప్పజెప్పి ఓట్లను నమోదు చేయిస్తున్నారు. కౌన్సిలర్ నుంచి రాష్ట్ర నేతల వరకు అందరూ ఇందులో భాగస్వామ్యం అయ్యారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంతగానూ పోటీ గతంలో ఎప్పుడూ జరగలేదు. అసలు డిగ్రీ చదువుకున్న వారికి ప్రత్యేకంగా ఓట్లు ఉంటాయని చాలా మందికి తెల్వదు. దాంతో డిగ్రీ పూర్తయినా గానీ, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో తమ ఓటును నమోదు చేయించుకోరు. అయితే ఈ సారీ జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు గత ఎన్నికలకు పూర్తి భిన్నంగా జరుగుతున్నాయి. ఈసారి బరిలో ముఖ్య నేతలందరూ పోటీలో నిలబడుతుండటంతో ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి. అంతే కాకుండా ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానం నుంచి బీజేపీ నేత రాంచందర్ రావు, నల్గొండ-వరంగల్-ఖమ్మం నుంచి టీఆర్ఎస్ నేత రాజేశ్వర్‌రెడ్డి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి పదవీ కాలం వచ్చే ఏడాదిలో పూర్తి కానుంది. దీంతో సిట్టింగ్ సీట్లను జారవిడుచుకోవద్దని అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ కసితో ఉంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానం నుంచి ఈ సారి టీజెఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ నిలబడుతున్నారు. టీఆర్ఎస్ నుంచి పలు పేర్లు వినబడుతున్నా ఇంకా అభ్యర్థి పేరు ఖరారు కాలేదు. బలమైన నాయకున్ని అక్కడ నుంచి పోటీలో దింపాలని టీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో ఈ స్థానంలో పోటీ టీఆర్ఎస్, టీజెఎస్ మధ్య తీవ్రంగా ఉండనుంది.
ఎవరికి వారు స్వతహాగా ఎమ్మెల్సీ ఓట్లను నమోదు చేయిస్తున్నారు. 2014 నుంచి 2017 మధ్య పాసైన డిగ్రీ విద్యార్థుల వివరాలను తెలుసుకుని వారిని ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారు. అంతే కాకుండా వారి ఫోన్ నంబర్లను కూడా తీసుకుని టచ్‌లో ఉంటున్నారు. ఓటుకు ఇంత అనే బేరసారాలు కూడా ఇప్పుడే మాట్లాడేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓటుకు ఒక గులాబీ నోటు అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇలా జిల్లాల వారీగా ఓట్ల నమోదు చేసి ఎన్ని ఓట్లు తమ ఆధీనంలో ఉన్నాయనే గెలుపు లెక్కలను గులాబీ పార్టీ ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటుందనే చర్చ జరుగుతోంది. అలాగే ప్రత్యర్ధుల బలాబలాను బేరీజు వేసుకుంటూ ఓటుకు పచ్చ నోటా? గులాబీ నోటా? ఏ నోటును ముట్టజెప్పాలనే ముందస్తు ప్లాన్‌లను పార్టీలు ఇప్పటి నుంచే వేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలా ఓటుకు నోటు అనే ఆఫర్‌ను ముందుగానే పార్టీ నేతలు ఓటర్లకు విసురుతున్నట్లు సమాచారం. అయితే ఎవరకి వారు తమ గెలుపుపై ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఏదేమైనా ఈసారి ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయనేది మాత్రం నిజం.