తమిళ మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి విలక్షణ నటనకి, వైవిధ్యమైన పాత్రలకు భాషతో సంబంధం లేదు. ఇటు తెలుగులోలైనా, అటు మలయాళంలోనైనా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకొనే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టడు. అలాగే పాత్ర హీరోనా? విలనా అని కూడా ఆలోచించడు.. అది ఎంతవరకు తన టాలెంట్ కు పరీక్ష పెడుతుంది? అని మాత్రం చూస్తాడు. ఈ క్రమంలో విజయ్ సేతుపతి ప్రస్తుతం ఓ మలయాళ మూవీలో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు. సినిమా పేరు ‘19 (1) (ఎ)’. భారత రాజ్యాంగంలో ప్రతీ పౌరుడికీ వాక్ స్వాంతంత్ర్యం, భావ వ్యక్తీకరణ హక్కు ఉందని చెప్పే ఆర్టికల్ అది.
మరి ఆ హక్కుకు ఎలాంటి భంగం కలిగింది ? దాని వల్ల ఎవరు ఎలా బాధపడ్డారు అన్నదే సినిమా కథాంశం. విజయ్ సేతుపతి మలయాళంలో మార్కోనీ మత్తాయి అనే మూవీతో తొలి సారి గా మాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. అందులో అతడు కేవలం గెస్ట్ రోల్ లో మాత్రమే కనిపించాడు. ఇదే సినిమాను తెలుగులో ‘రేడియో మాధవ్’ గా విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పుడు రెండో సారి విజయ్ సేతుపతి మలయాళంలోకి ఈ సినిమాతో అడుగుపెడుతున్నాడు. దీన్ని కొత్త దర్శకులు ఇందు వియస్ తెరకెక్కిస్తున్నారు. ఆంటో జోసెఫ్ నిర్మాణంలో రీసెంట్ గా ప్రారంభమైన ఈ సినిమా పూర్తిగా కేరళ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో ఇంద్రజిత్, ఇంద్రన్స్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ సినిమా విజయ్ సేతుపతికి ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.