ఈసారి ఎన్నికలు వస్తే ప్రధానిగా ఎవర్ని చూడాలనుకుంటారు అని ప్రశ్నిస్తే అందరి నోటా వచ్చే సోనూ సూద్ పేరు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఆయన రాజకీయాల్లోకి వస్తారా రారా అన్నది వేరే సంగతి. కానీ ఆయన అభిమానులు మాత్రం పెరిగిపోతున్నారు. జనం ఆదరాభిమానాలను పొందాలంటే ఇలాంటి సాయం మనం కూడా చేసి ఉంటే బాగుండేది కదా అని ఇతర నటులు అనుకునే దాకా పరిస్థితి వెళ్లింది. దీన్ని ఓట్లుగా మలుచుకునే ఆలోచన సోనూసూద్ కు ఉందోలేదోగానీ జనం మాత్రం ఇలాంటి నాయకుడు మనకు ఉండాల్సిందే అనుకుంటున్నారు.
డబ్బున్నవారు ఎవరైనా విరాళాలు ఇచ్చేసి చేతులు దులుపుకుంటారు. అంతకుమించిన ప్రచారాన్ని కోరుకుంటారు. సోనూ సూద్ ఇంతటి గుర్తింపు దక్కడానికి ప్రధాన కారణం ఆయన చేసిన దానాలు ఒక ఎత్తయితే, కరోనా పరిస్థితులను లెక్కచేయకుండా జనాన్ని వారి సొంతూళ్లకు తరలించడానికి ఆయన స్వయంగా రోడ్లపైకి రావడం విశేషం. అలా తిరిగి చేయడం వల్ల తన ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుందని ఎవరూ ముందుకు రారు. ఇప్పుడు సోనూ జనమే కాదు సినిమా హీరోలు, హీరోయిన్లు కూడా సిసలైన హీరోగా చూస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి పూజా భట్ ట్విట్టర్ ద్వారా స్పందించింది. సోనూలోని గొప్ప గుణాన్ని వర్ణించడానికి మాటలు రావడంలేదని ఆమె ట్వీట్ చేసింది.
మనం ఎన్నుకున్న నేతలు ఇలా చేస్తే ఎంత బాగుంటుంది అంటూ ఆమె వ్యాఖ్యానించింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా సోనూ తన సేవల్ని ఆపలేదు. ఆక్సిజన్ లేక, బెడ్స్ లేక ఇబ్బందులు పడుతున్నవారికి తన వంతు సాయాన్ని అందిస్తూనే ఉన్నారు. ఇటీవల బెంగళూరులో సోనూ టీమ్ చేసిన సాయంవల్ల 22 మంది కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డారు. ఇది చూసి హీరో మాధవన్ కూడా స్పందించారు. సోనూ లాంటి సేవకుల మీద ఆ దేవుడి దయ ఉండాలని ట్విట్టర్ ద్వారా అభినందించారు. ఇటీవల ఆయన భారతి అనే ఓ కొవిడ్ బాధితురాలిని నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించి ప్రత్యేక చికిత్స ఇప్పించిన సంగతి తెలిసిందే.
ఓ రియాల్టీ షోలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నప్పుడు కంటెస్టెంట్స్ ఆయన కోసం ఓ ప్రత్యేక ప్రదర్శన కూడా ఇచ్చారు. ఈ భావోద్వేగపూరిత ప్రదర్శనకు సోనూ కూడా చలించిపోయారు. భారతి కుటుంబసభ్యులు సోనూకి ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియో సందేశాన్ని కూడా ఈ షోలో ప్రదర్శించినప్పుడు ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఓ నటుడు ఇలా అసాధారణ సేవల్ని అందించడం, అందరికీ సోషల్ మీడియాలో అందుబాటులో ఉండటం మామూలు విషయం కాదు.